పెన్షన్‌దార్లకూ వర్తింపు
జులై 1 నుంచే అమల్లోకి..
కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం
గోధుమల మద్దతు ధర పెంపు
పప్పు ధాన్యాల దిగుబడికి ఊతం
కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు
కేంద్ర ఉద్యోగులు, పింఛన్‌దార్లకు విజయదశమి , దివాళీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం డిఎ, డిఆర్‌ను 3 శాతం మేర పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. పెంపుదలతో దాదాపు 49.19 లక్షల మంది సర్వీసులోని ఉద్యోగులకు, 68.72 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద 1.18 కోట్ల మందికి డిఎ, డిఆర్ మేలు జరుగుతుందని, దీనితో ప్రభుత్వ ఖజానాకు సంయుక్తంగా రూ 10,083 కోట్ల వార్షిక భారం పడుతుందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ బుధవారం నాటి సమావేశంలో డిఎ డిఆర్ పెంపుదల నిర్ణయాలను ఆమోదించారని వెల్లడించారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికన ధరలు ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. బేసిక్ పే , పెన్షన్ పరిధిలో ఉండే ఇప్పటి 55 శాతం డిఎ, డిఆర్‌లను మూడు శాతం కలిపి ఈ ఏడాది జులై 1 నుంచి లెక్కకట్టి ఉద్యోగులు, పింఛన్‌దార్లకు చెల్లిస్తారని మంత్రి తెలిపారు. దేశంలో గోధుమ పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని క్వింటాలుకు 6.59 శాతం అంటే రూ 160 చొప్పున పెంచాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదం దక్కింది. ఇకపై క్వింటాలు ధర రూ 2,585 అవుతుంది. ఇంతకు ముందు వరకూ ఇది రూ 2,425గా ఉంది. దేశంలో ప్రధాన శీతాకాలపు అంటే రబీ పంటగా గోధుమ ఉంది.
రూ 11,440 కోట్లతో పప్పుల ఉత్పత్తికి సంకల్పం
దేశంలో వివిధ రకాల పప్పుల వాడకానికి ఉన్న ప్రాదాన్యతను గుర్తించిన కేంద్ర సమగ్ర రీతిలో ఆత్మనిర్భరత పథకం తీసుకువచ్చింది. ఆరు సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ పథకం అమలుకు రూ 11,440 కోట్ల ఆర్థిక కేటాయింపుల నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పప్పుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడమే ఈ పథకం లక్షం అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ పథకం తీసుకువచ్చారు. నిత్యావసర ఆహార సరుకులు అయిన కందిపప్పు, మినప, పెసర ఇతరత్రా పప్పుల ఉత్పత్తిని పెంచే లక్షంతో ఈ పథకానికి సంకల్పించారు. 203032 నాటికి దీనిని 3650 లక్షల టన్నులకు చేర్చాలని సంకల్పించారని మంత్రి తెలిపారు. ఇప్పుడున్న హెక్టారుకు 881 కిలోల దిగుబడిని 1130 కిలోల స్థాయికి పెంచాలనేదే ఆలోచన అంతకు మించి మా ముందున్న లక్షం అని ప్రభుత్వం తెలిపింది.
86వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య
దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు (కెవిఎస్) ఆరంభించాలనే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనితో మొత్తం మీద 86, 000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యం ఏర్పాట్లు జరుగుతాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో 7 కెవిఎస్‌లు ఆరంభిస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరంభించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ సరైన సంఖ్యలో కెవిపిలు లేని చోట్లను గుర్తించారు.ఈ మేరకు ఆమోదిత కెవిపిలలో 20 వరకూ ఆయా జిల్లాలో నెలకొల్పుతారని మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. కొత్తగా కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు రూ 5862.55 కోట్లు వ్యయం అవుతుంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాల్లో ఆదర్శ పాఠశాలలు నెలకొల్పాలనే తలంపునకు అనుగుణంగా ఇప్పుడు 57 కెవిపిలు కొత్తగా ఆరంభం అవుతాయి.