ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.ఈ ఈ ఘటనలో కనీసం 69 మంది మృతి చెందారు. వేలాదిగా నిర్వాసితులు అయ్యారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సెబూ ప్రాంతం భారీ తాకిడికి గురైంది. దీనితో వందలాది ఇళ్లు కూలాయి. పలువురు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటికీ మృతుల సంఖ్య ఎంత అనేది నిర్థారణ కాలేదు. మంగళవారం రాత్రి రెక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించడంతో బోగో ఇతర ప్రాంతాలలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో , సరైన సమాచార వ్యవస్థ లేని చోట ఉపద్రవం నెలకొనడంతో తెల్లవారుజాము వరకూ పరిస్థితి గురించి సరైన సమాచారం లేకుండా పోయింది. దీనికి తోడు వర్షాలు, దెబ్బతిన్న రాదార్లతో జనం పలు ప్రాంతాల్లో చిక్కుపడ్డారు. సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలివెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎంత మంది మృతులు, గాయపడ్డ వారు అనేది నిర్థారణ అయ్యేందుకు సమయం పడుతుంది.