కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి స్థానిక ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. తదుపరి చికిత్స ప్రక్రియ నేపథ్యంలో వెంటనే పేస్‌మేకర్ అమర్చాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. శ్వాస సంబంధిత సమస్యలు , జ్వరంతో బాధపడుతున్న ఖర్గేకు గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన కుమారుడు, కర్నాటక రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే బుధవారం తెలిపారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన కోలుకోవాలని సందేశాలు పంపిన వారికి, ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలు అని ప్రకటనలో తెలిపారు.పూర్తిగా విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని , వైద్య బృందం పర్యవేక్షణలో పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
గురువారం ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. కుమారుడితో మాట్లాడారు. మంగళవారం అంతా ఆయన పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వరద తాకిడి జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ప్రధాన మంత్రికి నష్టం వివరాలపై లేఖ రాయాలని సంకల్పించారు. ఈ లోగా అస్వస్థతకు గురయ్యారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అస్వస్థత తలెత్తగానే ఆసుపత్రికి తరలించడం వెంటనే చికిత్స చేపట్టడం వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడింది. జనరల్ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని ముఖ్యమంత్రి వివరించారు.