కెసిఆర్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
రేవంత్ పాలనలో పెరిగి 14వ స్థానానికి చేరాయి
జాతీయ నేర గణాంక లెక్కలు కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు
: మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడి
రైతు ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అది 2023 నాటికి 56కి తగ్గిందని తెలిపారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి పరిమితమైందని పేర్కొన్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51 శాతంగా నమోదైందని, 10 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గాయని వెల్లడించారు. ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలని హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ నేర గణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు వంటివని పేర్కొన్నారు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, ఆయన చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితమే ఇదంతా అని తెలిపారు. రుణమాఫీతో రైతన్నకు ధీమా దొరికిందని, రైతు బంధు బంధువు అయ్యిందని పేర్కొన్నారు. రైతు బీమా కొండంత భరోసా ఇవ్వగా, 24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపిందని వెల్లడించారు. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై కేసీఆర్ పాలనలో తెలంగాణ విరాజిల్లిందని గుర్తు చేశారు. కెసిఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానమని తెలిపారు. కేసీఆర్‌కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధమైతే కాంగ్రెస్‌కు ఉన్నది కేవలం ఓటు బంధమేనని ఆ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ది అభయహస్తం కాదు బస్మాసుర హస్తం
కాంగ్రెస్‌ది అభయహస్తం కాదని బస్మాసుర హస్తమని హరీశ్‌రావు ఆరోపించారు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చేదు ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు పెండింగ్ డిఏ ను తక్షణమే చెల్లిస్తామన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వమని ఆయన వేరొక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నిలదీశారు. కమిషన్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 73 శాతం గరిష్ట పిఆర్‌సి అందించిన ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రూ.5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దృష్టిలో డిఏ అంటే డోంట్ అస్క్ అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని తెలిపారు.
దక్షిణ భారతదేశ రైతులంటే బిజెపికి చిన్న చూపెందుకు
క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచి, వరికి మాత్రం 69 రూపాయలు పెంచుతారా అని ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి, దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు దక్షిణ భారతదేశ రైతులంటే బిజెపికి చిన్న చూపని ప్రశ్నించారు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బిజెపి ఎంపీలారా రైతుల పక్షాన నిలబడతారా? కేంద్రానికి కొమ్ము కాస్తారా? అని ప్రశ్నించారు.