పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
ముజఫరాబాద్ లో మంగళవారం ఇద్దరి మృతి
ప్రాథమిక హక్కులను కూడా నిరాకరించారన్న నిరసనకారులు
38 డిమాండ్లతో నిరసనకారుల లాంగ్ మార్చ్
అల్లర్లు అణచి వేసేందుకు రాజధాని నుంచి అదనపు బలగాలు
నిరసనలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసకు దారితీయడంతో సైన్యంకాల్పులకు తెగబడింది. దీంతో 8 మంది పౌరులు చనిపోయారు. మంగళవారం ముజఫరాబాద్ లో మరో ఇద్దరు నిరసనకారులు చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. . పాక్ ప్రభుత్వం కనీసం ప్రాథమిక హక్కులను కూడా తిరస్కరించడంతో అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా భారీ ఎత్తున నిరసనలతో ఆ ప్రాంతం అల్లకల్లోలమైంది. మార్కెట్లు , దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. అలాగే రవాణా సేవలను కూడా నిలిపివేశారు.బుధవారం ఉదయం నుంచి నిరసన కారులు పోలీసులు, సైన్యంపై రాళ్లు రువ్వారు. వారు ముందుకు రాకుండా అడ్డగించేందుకు వంతెనలపై ఏర్పాటు చేసిన షిప్పింగ్ కంటైనర్లను వారు నదిలోకి నెట్టివేశారు.ముజఫరాబాద్ లో మరణాలకు పాక్ రేంజర్లు జరిపిన కాల్పులే కారణమని వారు అవామీ ఆక్షన్ కమిటీ ఆరోపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా ముజఫరాబాద్ లో నిరసనకారుల లాంగ్ మార్చ్ కొనసాగుతోంది..
పాకిస్తాన్ లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు పిఓకె అసెంబ్లీలో రిజర్వుచేసిన 12 సీట్లను రద్దుచేయడంతో పాటు దాదాపు 38 డిమాండ్లు చేస్తున్నారు.70 ఏళ్లుగా అక్రమిత కశ్మీర్ లో ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు నిరాకరిస్తూ వచ్చాయని, ఆ హక్కులను సాధించుకునేందుకు తమ పోరాటం అని జెఎఎసి నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ అన్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు కూడా మీర్ హెచ్చరిక చేశారు.ముజఫరాబాద్ లో మరణించిన వారికి సంఘీభావం తెలిపేందుకు అక్కడకు చేరుకునేందుకు సైన్యం ఏర్పాటు చేసిన బారికేట్లను ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ, కాల్పులు జరిగాయి. ముజఫరాబాద్ లో కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఎఎసి డిమాండ్ చేసింది. కాగా ఆక్రమిత కశ్మీర్ లో అల్లర్లను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం 1000 మందికి పైగా సైనికులతో అదనపు బలగాలను రాజధాని నుంచి పంపింది.