టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా ఎవరు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మొదటి సిరీసే పటిష్టమైన ఇంగ్లండ్‌తో తలపడే సవాల్‌ను గిల్ ముందుంచారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో శుభ్‌మాన్ భారత జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. సిరీస్ డ్రాగా ముగిసింది. మరోవైపు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసింది కూడా గిల్‌యే కావడం మరో విశేషం. అయితే ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కి గిల్ సన్నద్ధమవుతున్నాడు. ఈ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొనే ముందు సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్‌సన్‌ల నుంచి సలహాలు తీసుకున్నట్లు అతడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సచిన్‌తో తొలుత మాట్లాడాలంటే భయం వేసిందని.. కానీ, మాట్లాడాక మాత్రం అద్భుతమైన అనుభూతి కలిగిందని శుభ్‌మాన్ గిల్ పేర్కొన్నాడు. మిడాఫ్ ఆడేటప్పుడు బంతిని స్టంప్స్ పైకి రానివ్వకుండా చూడాలని.. అప్పుడు అలాంటి బంతులు స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు వీలుంటుందని సచిన్ సూచించినట్లు తెలిపాడు. తన బ్యాటింగ్‌లో లోపాలను సచిన్ కనిపెట్టారని.. ఆ తర్వాత నుంచి నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేశానని గుర్తు చేసుకున్నాడు.
ఇక స్టీవ్ స్మిత్ మానసికంగా బలంగా ఉండాలని చెప్పాడని గిల్ అన్నాడు. ఇంగ్లండ్ పేసర్లను ఎదురుకొవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలని స్మిత్ చెప్పాడన్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా మంచి సూచనలు ఇచ్చాడని గిల్ తెలిపాడు.