మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రులు వర్సెస్ ఐఏఎస్‌లుగా పలు శాఖల్లో వార్ నడుస్తోంది. మంత్రులు చెబితే తామెందుకు చేయాలని ఐ ఏఎస్‌లు వ్యవహారిస్తున్నట్టుగా సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐఏఎస్‌ల తీరుతో ప్రభుత్వంలో వారి పనితీరు వివాదాస్పదం అవుతోంది. శాఖల్లో మేమే సర్వం మేం చెప్పినట్లే జరగాలి అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు బ్యూరోక్రాట్స్ తీరు ఉం టోందన్న చర్చ జరుగుతోంది. వారు తీసుకునే నిర్ణయాలతో పాటు వ్య వహారిస్తున్న తీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు మినహా చాలా మంత్రుల పేషీల్లో ఇదే తం తు కొనసాగుతోందని సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. మం త్రి ఒకటి చెబితే ఐఏఎస్‌లు మరొకటి చేస్తూ చివరకు ఆ ఫైల్ ముం దు కు పోకుండా పెండింగ్‌లో పెడుతున్నారని తెలిసింది. ఫైళ్లను ఎందు కు పెండింగ్ పెడుతున్నారని మంత్రులు అడిగితే నిబంధనలు అడ్డుగా ఉ న్నాయని ఐఏఎస్‌లు పేర్కొంటున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పలువురు మంత్రులు ఐఏఎస్‌ల తీరుపై సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఐఏఎస్‌లు తమ కింద పనిచేసే అధికారులను చిన్నచూపు చూడడం, అమర్యాదగా వ్యవహారిస్తుండడంతో వారి ప్రవర్తనపై సచివాలయ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.
ఏక వచనంతో మంత్రిని సంబోధిస్తూ…
ఇటీవల కాలంలో కొందరు ఐఏఎస్‌లు మంత్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ ల పనితీరుపై ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆ బ్యూరోక్రాట్స్ లో మార్పు మాత్రం రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సెక్రటేరియట్‌లో ఓ మంత్రి ఓ శాఖ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి సంబంధిత శాఖపై వివరాలు అడగ్గా సదరు ఐఏఎస్ అధికారి అటువైపు మాట్లాడే వ్యక్తి మంత్రి అనే మర్యాద కూడా లేకుండా దురుసుగా మాట్లాడినట్లుగా తెలిసింది. ఏక వచనంతో మంత్రిని సంబోధిస్తూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది. దీంతోపాటు అటవీ శాఖ, ఎక్పైజ్ శాఖలోనూ మంత్రుల ఆదేశాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండడం విశేషం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అగౌరపరిచేలా
ఐఏఎస్‌లు సామాజికవర్గాల నేపథ్యాన్ని చూసి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తున్నా ఐఏఎస్‌లు మాత్రం బలహీన వర్గాలు, అణగారిన వర్గాల వారిని పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయానికి నియోజకవర్గ పనుల కోసం వచ్చే ప్రజాప్రతినిధులకు ఐఏఎస్‌ల నుంచి పరాభావం ఎదురవుతోందని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అగౌరపరిచేలా బ్యూరోక్రాట్స్ వ్యవహారశైలి ఉందని ఈ మధ్య పలువురు ప్రజాప్రతినిధులు సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వ్యవహారించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జెండా ఆవిష్కరణకు వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్ల ఫ్రొటోకాల్ పాటించక పోవడంతో పాటు సదరు కలెక్టర్‌పై హైకోర్టు కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో జరిగిన మెమోంటోల బహుకరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను అధికారులు అవమానించారని, ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి ఫొటోను చిన్నగా పెట్టి అవమానించారని మంత్రి కలతచెందినట్టుగా తెలిసింది. మెమోంటోపై మంత్రి ఫొటోను చిన్నగా పెట్టడంతో మంత్రి కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేసినట్టగా సమాచారం.
జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన ఐఏఎస్‌ల్లో….
ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు ఐఏఎస్‌ల తీరు మరింత ఇబ్బందికరంగా మారిందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఐఏఎస్‌లు చాలా హుందాగా వ్యవహారించాల్సి ఉండగా ఇష్టానుసారంగా వారు మాట్లాడడం తగదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీల రూపకల్పన నుంచి అవి అమలయ్యే వరకు కొందరు ఐఏఎస్‌ల వ్యవహారం సరిగా ఉండడం లేదన్న భావనను ప్రభుత్వం కూడా గుర్తించినట్టుగా తెలిసింది. పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అధికారులకు సూచనలు చేయడంతో పాటు అలసత్వం ప్రదర్శించిన వారిని హెచ్చరించారు. అయినా వారి తీరు మారడం లేదని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
తనకు కేటాయించిన చాంబర్‌ను వదిలి వేరే ఐఏఎస్ చాంబర్‌లో
నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులను గంటల తరబడి వేచి ఉంచడం, కొందరికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తిప్పి పంపుతున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఏదో సమస్యతో వచ్చే సాధారణ ప్రజలను అసలు కలిసేందుకే ఐఏఎస్‌లు సమయం ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల కోసం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సమయం కేటాయించారు. కానీ, ఒక్కో ఐఏఎస్ ఒక్కో విధమైన సమయంలో అపాయింట్‌మెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది. రెండు గంటల సందర్శకుల సమయాన్ని ప్రస్తుతం గంటకు కుదించడం విశేషం. కొందరు ఆ సమయంలో సెక్రటేరియట్ లోనే ఉండకుండా బయటకు వెళ్లిపోతున్నారు. సెక్రటేరియట్ లో ఉన్నా ఇతర అధికారుల ఆఫీసుల్లో ఉండటం సమీక్ష సమావేశాలని, మంత్రులతో మీటింగ్ అని, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం అని చెప్పి తప్పించుకుంటున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సీనియర్ ఐఏఎస్ తనకు కేటాయించిన ఛాంబర్ వదిలి వేరే ఐఏఎస్‌కు చెందిన ఛాంబర్ లో విధులు నిర్వర్తిస్తుండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
క్షేత్రస్థాయికి వెళ్లని కలెక్టర్‌లు…
పలు శాఖలకు ముఖ్య, ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న అధికారుల తీరు మరింత చర్చనీయాంశమవుతోంది. వారి తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. సమీక్షల సమయంలో ఆయన ఆ ఐఏఎస్‌లపై అసహనం వ్యక్తం చేస్తుండడమే ఇందుకు నిదర్శనమని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయినా ఐఏఎస్‌ల తీరు మాత్రం మారడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధికారులు వారి శాఖల్లో తీసుకునే నిర్ణయాలు కూడా ఇష్టారీతిన తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాల్లోని కలెక్టర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. పలుమార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో క్షేత్రస్థాయికి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని సిఎం సూచించినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.