వాషింగ్టన్ : ఇటీవల లక్ష డాలర్ల వరకు కొత్త దరఖాస్తుదారులకు హెచ్1 బి ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తాజాగా దాని అమలు తేదీని వెల్లడించింది. 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే దానికి ముందే ఆ వీసాల జారీలో గణనీయమైన మార్పులు ఉంటాయని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. పాత విధానంలోని లోపాలకు స్వస్తి పలుకుతామని మంగవారంనాడు ఆయన వెల్లడించారు. హెచ్1 బి నూతన వీసాదారులకు లక్ష డాలర్ల ఫీజు కారణంగా భవిష్యత్‌లో అమెరికాకు వచ్చే వారిపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాటరీ పద్ధతిలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని లుట్నిక్ సంకేతాలిచ్చారు. అసలు లాటరీ ద్వారా అమెరికా నిపుణులైన కార్మికులను, ఉద్యోగులను తీసుకువచ్చుకోవడమేంటన్నారు. పాత విధానంలో ఉన్న లోటుపాట్ల కారణంగా నైపుణ్యం లేని వాళ్లు కూడా కుప్పలు తెప్పలుగా అమెరికాకు వచ్చిపడుతున్నారన్నారు.
అమెరికన్లకు మేలు చేకూరే విధంగా చర్యలు చేపడుతూ పాత విధానంలోని కొన్ని నిబంధనలకు చెల్లుచీటి ఇస్తామన్నారు. తద్వారా ఇక నుంచి విదేశాల నుంచి అత్యుత్తమ నిపుణులే దేశానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని, తదనుగుణంగా వీసా విధానంలో మార్పులు చేర్పులు తీసుకువస్తామన్నారు. ఉద్యోగి జీతం, దాని స్థాయి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని లుట్నిక్ సూచన ప్రాయంగా చెప్పారు.
భారత్‌వైపు ఆఫ్‌షోర్ కంపెనీల చూపు…
హెచ్1బి వీసా ఫీజులు అమెరికా భారీగా పెంచిన తరుణంలో వాటి ప్రభావంపై అధ్యయనం చేస్తున్న కంపెనీలు వివిధ దారులు వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్‌షోర్ కార్యకలాపాల కోసం భారతదేశంవైపు మొగ్గు చూపుతున్నాయి. మల్టీనేషన్ కంపెనీలలు భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జిసిసి) ద్వారా వీటిని చేపట్టే యోచన చేస్తున్నట్లు సమాచారం. విదేశాల్లోని నిపుణుల సేవలను, సామర్ధాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేందుకు బహుళజాతి సంస్థలు ఇక్కడ జిసిసి కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. భారతదేశంలో ఇప్పడు వీటి సంఖ్య 1700 వరకు ఉంటుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తంలో సగం భారత్‌లోనే ఉండడం విశేషం.