త్వరలో నిజాలు బయటపడతాయి
కరూర్ ఘటనపై టివికె చీఫ్ విజయ్ వీడియో సందేశం
నా హృదయం విలవిలాడిపోతోంది
సురక్షిత ప్రాంతంలో సభ జరిగేందుకు పోలీసుశాఖను అభ్యర్థించా
ఉద్రిక్తత తలెత్తుతుందనే ఇప్పటి వరకు మళ్లీ కరూర్ వెళ్లలేదు
కరూర్‌లోనే ఎందుకు ఈ ఘటన జరిగింది?
సిఎం స్టాలిన్‌పై విమర్శలు
చెన్నై : కరూర్ తొక్కిసలాట సంఘటనపై సినీనటుడు, టివికె పార్టీ అధ్యక్షుడు విజయ్ తొలిసారి స్పందించారు. ఘటన తర్వాత అనుభవించిన మనోవ్యధ వెల్లడించారు. అదే సమయంలో సిఎం స్టాలిన్‌పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. తన జీవితంలో అలాంటి సంఘటనను ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వైపు ఎటువంటి తప్పు లేకపోయినా కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. ‘నా జీవితంలో ఇంతటి బాధ ఎన్నడూ పడలేదు. నా హృదయం విలవిల్లాడిపోతోంది. ప్రచారంలో నన్ను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. నాపై వారు చూపుతున్న ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. అదే సమయంలో వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు సురక్షితమైన ప్రాంతంలో సభ జరగాలనే నేను కోరుకున్నాను. అదే విషయమై పోలీస్ శాఖను అభ్యర్థించాను. కానీ జరగకూడనిది జరిగింది. అంతకు ముందు మేం ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాం. కానీ ఒక్క కరూర్ లోనే ఎందుకు ఇలా జరిగింది. ప్రజలకు నిజం తెలుసు. వారంతా చూస్తున్నారు. నేను కూడా మనిషినే. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందనే నేను అక్కడ పర్యటించలేదు. త్వరలోనే వారిని కలుస్తా. కరూర్ ప్రజలు నిజాలు మాట్లాడినప్పుడు దేవుడే అలా మాట్లాడినట్టు అనిపించింది. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. మేం ఎలాంటి తప్పులు చేయకపోయినా, పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్‌మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు’ అని తన వీడియో సందేశంలో విజయ్ పేర్కొన్నారు. ‘సీఎం సర్.. మీరు నాపై కక్ష తీర్చుకోవాలంటే నన్ను ఏదైనా చేయండి’ అన్నారు. తాను ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ ఉంటానని, కానీ తన ప్రజల జోలికి వెళ్లొద్దన్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. తన రాజకీయ జీవితం మరింత ఉత్సాహంతో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి కరూర్‌లో విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
పోలీసుల దర్యాప్తు, టివికె నేత అరెస్ట్
కరూర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించి సోమవారం రాత్రి పోలీసులు కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగళన్‌ను అరెస్టు చేశారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. విచారణాధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించి, ఆయన స్థానంలో అదనపు డిప్యూటీ ఎస్పీ ప్రేమానందన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. మరోవైపు విజయ్ ఉద్దేశ పూర్వక బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలను కలుస్తాం : టివికె
త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తామని టీవీకే నేత అధవ్‌అర్జున వెల్లడించారు. ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని, బాధిత కుటుంబాలతో కలిసి తమ సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే టీవీకే బాధితులకు రూ. 20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ తొక్కిసలాట సంఘటనలో41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
యూట్యూబర్ అరెస్టు
కరూర్ ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని కేసు
చెన్నై : కరూర్ సంఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా ఓ యూట్యూబర్‌ను అరెస్టు చేశారు. విజయ్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న తమిళనాడు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించినదని చెబుతూ నకిలీ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా జెరాల్డ్ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నేపాల్‌లో లా యువత తిరగబడాలంటూ టీవీకే నేత పోస్టు
విజయ్ ర్యాలీలో కుట్రపూరితంగానే తొక్కిసలాట జరిగేలా చేశారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై కుట్రలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే నేపాల్ మాదిరిగా తమిళనాడు యువత తిరగబడాలని టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ అర్జున సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. శ్రీలంక, నేపాల్‌లోలాగా ఇక్కడ కూడా యువత ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని, ఆ ఉద్యమమే ప్రభుత్వం మార్పునకు కారణం కానుందని, అందులో పేర్కొన్నారు.
స్టార్ హీరో సభకు ఇంత ఇరుకైన ప్రదేశమా?
కరెంట్ కట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది
తొక్కిసలాటకు బాధ్యులెవరు ? : హేమమాలిని
కరూర్ : తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని హేమమాలిని నేతృత్వంలోని బిజెపి ఎంపీల బృందం మంగళవారం పరిశీలించింది. బాధిత కుటుంబాలను పరామర్శించి సంఘటన జరిగిన తీరును తెలుసుకుంది. స్టార్ హీరో ప్రచార సభకు ఇరుకైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై బృందం విమర్శలు గుప్పించింది. ఇంత టి విషాదకరమైన తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరని ప్రశ్నించింది. తొక్కిసలాట సంఘటన ప్రాంతాన్ని పరిశీలించామని, జరిగిన ఉదంతాన్ని గురించి బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నట్లు హేమమాలిని వివరించారు. ఏ రాజకీయ ప్రచార సభ లోనూ ఇటువంటి తొక్కిసలాట సంభవించలేదన్నారు. స్టార్‌హీరో సభకు ఇరుకైన సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం సరికాదని, బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. విశాల ప్రాంగణాన్ని కేటాయిస్తే ఈ విషాదం జరిగేది కాదన్నారు. ఇరుకైన వేదిక, కరెంట్ కట్ చేయడం వంటివి అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇవి అసాధారణంగా కనిపిస్తున్నాయని హేమమాలిని అభిప్రాయపడ్డారు. మరో ఎంపీ అనురాగ్‌ఠాకూర్ మాట్లాడుతూ .. విజయ్ ప్రచార సభకు ఏర్పాట్లు చేయడంలో తమిళనాడు పోలీసులు నిర్లక్షం వహించినట్టు కనిపిస్తోందన్నారు.