నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, నాగులపల్లిలో వాగు దాటుతుండగా ఎద్దుల బండి కొట్టుకుపోగా ఎద్దులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఎడ్ల బండి యజమాని జక్కుల వెంకటస్వామి, అతని భార్య అడివమ్మ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…కోడేరు మండలం, నాగులపల్లి పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జక్కుల వెంకటస్వామి, అతని భార్య అడివమ్మ వాగు అవతలి ఒడ్డులో ఉన్న తన రెండు ఎకరాల భూమిలో సాగు చేయడానికి వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే, వాగు మధ్యలో ఎద్దుల బండి బోల్తా పడి భార్యభర్తలిద్దరూ కొంతదూరం కొట్టుకుపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులోని జమ్ము పట్టుకుని బయటపడ్డారు. అయితే, లక్షలు విలువ చేసే ఎద్దులను కోల్పోయామని, జీవనోపాధి పొందేందుకు ఎద్దులు ఎంతో అవసరమని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. తోటి రైతులు గ్రామస్థులు కలిసి తాడు సహాయంతో మృతి చెందిన ఎద్దులను, బండిని ఒడ్డుకు లాగారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు వేడుకొంటున్నారు. వర్షాకాలం వస్తే పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.