బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు నెరవేరిస్తే బాకీ కార్డు అంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని బిసి రిజర్వేషన్లతో మరోసారి స్పష్టమైందన్నారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్-బిజెపి కలిసి సంసారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. బాకీల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అవుతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్ ప్రచారం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన మీకు బకాయి అనే పదం కూడా పలికే అర్హత లేదన్నారు.