న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మంగళవారం పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనలో మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) సిబ్బంది కూడా సహాయక కార్యక్రమంలో పాల్గొంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నగరలో ఉన్న ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టాలోని జర్ఘూన్ రోడ్‌లో జరిగిన భారీ పేలుడుతో సమీపంలోని భవనాల కిటికీలు, తలుపులు పగిలిపోయాయి. బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కన్సల్టెంట్లు, వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక, పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్వెట్టా పేలుడు ఆత్మాహుతి దాడిగా పాకిస్తాన్ మీడియా పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 4న క్వెట్టాలో నిర్వహించిన ఓ రాజకీయ ర్యాలీలో జరిగిన బాంబు పేలుడులో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.