మన తెలంగాణ/సిటీబ్యూరో/ఎల్‌బినగర్: బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. గిన్నిస్‌బుక్ రికార్డు వచ్చెను ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి సందమామ.. రెండు రికార్డులు సాధించెను సందమామ.. తెలంగాణ పూల సింగిడి.. ఆడపడుచుల పండుగ ‘బతుకమ్మ’ వేడుక అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. ఏకంగా రెండు గిన్నిస్ వరల్ రికార్డ్స్ బతుకమ్మ సంబురాలు కాస్త తమ ఖాతాలో వేసుకున్నవి. సద్దుల బతుకమ్మ వేడుక సందర్భంగా సోమవారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్‌నగర్ స్టేడియంలో 63.11 అడుగులు ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల సహజసిద్ద్ధమైన పూలతో భారీ బతుకమ్మను పేర్చారు. ఈ 63.11 అడుగుల ఎత్తున్న మెగా బతుకమ్మ ‘అతిపెద్ద బతుకమ్మ’గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. బతుకమ్మ మరో ఘనతను కూడా దక్కించుకుంది. ఈ 63.11 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి జానపద పాటలతో లయబద్దంగా ఆడిపాడారు. ఒకేసారి ఇంతమంది మహిళలు బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ వేడుకను నిర్వహించడం తెలంగాణ జానపద నృత్యంగా బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్ నమోదు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి వేడుక వేదికపై నుండి రికార్డుల ప్రకటన చేశారు.
తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ పండుగ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడంపై రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంస్కృతిని ఖ్యాతిని ప్రపంచానికి చాటామని పేర్కొన్నారు. బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గల్లి నుంచి గ్లోబల్ వరకు ఏదైనా తెలంగాణ ప్రజలు సాధిస్తామని మహిళలు నిరూపించారని చెప్పారు. ఏ రంగంలోనైనా ముందుడుగు వేస్తామని స్పష్టంచేశారు. ఇంతగొప్ప కార్యక్రమం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మకు ప్రతిష్టాత్మక గిన్నిస్ రికార్డ్ కోసం రెండు నెలలుగా కృషిచేసి కార్యక్రమం విజయవంతం చేసిన అందిరికి ఈ సందర్భంగా సీతక్క అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అధికారులు టూరిజం విభాగధిపతి వల్లూరి క్రాంతి, జీహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ పంకజ, ప్రజాగాయకురాలు విమలక్క, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.