స్థానిక నగారా మోగగానే పల్లెల్లో కొత్త నీరు ప్రవహించే స్థితి నెలకొన్నది. ఇన్నాళ్ళూ ఊళ్లలో తమ అధికారం పటిష్టమవుతుందని కలలు గన్న అనేక మంది గ్రామీణ నాయకుల ఆశలు గల్లంతైనాయి. పార్టీల నాయకులకు తామే సర్వం అని భావిస్తూ వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలకు కాళ్ళకింద నేల కదలడంతో దసరాకు ముందే అనేక గ్రామాల్లో నిశ్శబ్దం ఆవరించుకున్నది. కొత్త చట్టం, నూతన రిజర్వేషన్ ప్రక్రియ, కోర్టు తీర్పులతో ప్రమేయం లేకుండా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వానికి దారులు వేస్తున్నది. ఒక పరిశీలన ప్రకారం అనేక గ్రామాల్లో ఇప్పుడు కొత్త రాజకీయాలకు తెర లేచే అవకాశం నెలకొన్నది. మాండలిక రాజ్యాంగ వ్యవస్థ రూపుదిద్దుకున్న క్రమంలో నాలుగంచెల వ్యవస్థ గ్రామీణ రాజకీయ వ్యవస్థలో భాగమైనప్పుడు కూడా పల్లెల్లో వినూత్న రాజకీయ ఒరవడికి అవకాశం ఏర్పడింది. అప్పుడు మొదటి ఎన్నికలు ప్రత్యక్షంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల నాటికి అంటే 1987లో మొదటిసారి మాండలిక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు అమలైన రిజర్వేషన్ల ప్రక్రియ మొదటిసారి బిసిలకు స్థానిక సంస్థల్లో నాయకత్వం వహించే అవకాశాన్నిచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కొత్త రాజకీయ నాయకులు తాము ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలుగా మారేందుకు ఆ ఎన్నికలను ఇరుసుగా ఎంచుకోగలిగారు.
మొదటిసారి మాండలిక రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపిపి, జెడ్‌పి చెయిర్ పర్సన్‌లు తదనంతర కాలంలో పరోక్ష ఎన్నికల ద్వారా ఎంపిపి, చెయిర్ పర్సన్‌ల ఎన్నికల వైపు వెళ్ళే నాటికి ఆయా గ్రామాల్లో నాయకులుగా ఎదగగలిగే అవకాశం లభించింది. మహిళా రిజర్వేషన్‌ల అమలు, దానికి తోడు బిసిలకు రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభ చట్టం తెచ్చిన ప్రస్తుత ఎన్నికలు మరిన్ని విప్లవాత్మకమైన, వినూత్న రాజకీయాల శ్రీకారం చుట్టే అవకాశం ఇప్పుడు నెలకొన్నది. ఈసారి ఎన్నికలకు ముందు పదేళ్ళ పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన ప్రస్తుత భారత రాష్ట్ర సమితి అధికారంలో కొనసాగడంతో అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా మంది తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావించారు. ఆ మేరకు అనేక అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ద్వితీయశ్రేణి నాయకులు దాదాపుగా తమకు అధికార పగ్గాలు ఖాయమనే ధీమాతో గ్రామాల్లో తమ ప్రాభవాన్ని పెంచుకోజూసారు. మంత్రులు, ఎంఎల్‌ఎలకు, ఎంపిలకు ముఖ్య అనుచరులుగా చెలామణి అవుతూ తాము అనుకున్నదే అంతటా జరుగుతాదని భావించారు. కొత్త చట్టం వచ్చింది. కనీసం అరవై శాతం పల్లెల్లో అంచనాలు తలకిందులయ్యాయి.
ద్వితీయ శ్రేణిలో తమకింక ప్రత్యామ్నాయమే ఉండదని భావిస్తూ గ్రామాల్లో పంచాయతీలు, పైరవీలతో తమ ఆధిపత్యం చెలాయించిన నాయకులకు కొత్త చట్టం నిర్దేశించిన రిజర్వేషన్ ప్రక్రియ ఒక్కసారిగా అశనిపాతం లా తాకింది. కొత్త చట్టం ఊతంగా కొత్త నాయకులకు అవకాశాలూ మెరుగయ్యే స్థితి ఇవాళ్ళ ప్రతీ గ్రామీణ ప్రాంతంలో కనిపిస్తున్నది. అనేక గ్రామాల్లో తమ అంచనా ప్రకారమే రిజర్వేషన్లు వస్తాయని ఇప్పటికే కార్యాచరణలో ఉన్న నాయకులు రిజర్వేషన్ల ప్రకటన గెజిట్ రూపం దాల్చగానే దాదాపుగా కనుమరుగయ్యారు. గ్రామాల్లో ఈసారి బతుకమ్మ, దసరా పండుగలను తమ నేతృత్వంలో నిర్వహించడం ద్వారా పల్లె ఓటర్లను ఆకట్టుకుందామని ఫ్లెక్సీలు, ప్రచార అస్త్రాలతో తయారైన అనేక మంది ఆశావహులు పండగనాటి వరకూ రోడ్డు కూడా ఎక్కలేని రీతిలో రిజర్వేషన్ల నిర్ణయం జరిగింది. కోర్టు ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటుందని తద్వారా తాము మళ్ళీ రిజర్వేషన్లను మార్చుకునే తరహాలో ప్రభావితం చేయగలమని అనుకున్న వాళ్ళకు సోమవారం షెడ్యూల్ విడుదలకాగానే ఇంక మార్గాలన్నీ మూసుకుపోయాయనే భావన కలుగుతున్నది. ఇది నాణానికి ఒక వైపు కనిపిస్తున్న వాస్తవం. మరో వైపు దాదాపు డ్బ్బై శాతం గ్రామాల్లో ఇప్పుడు కొత్త రక్తం రాజకీయాలను ఎంచుకునే అవకాశం లభించింది. మహిళా రిజర్వేషన్లు, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లతో బాటు, బిసిలకు మారిన శాతంతో రిజర్వేషన్ల అమలు ప్రక్రియతో అనేక గ్రామాల్లో నూతన నాయకుల ఆరంగేట్రం తప్పక జరుగుతుందనే భావన నెలకొన్నది.
యువతీ యువకులు, విద్యాధికులు ఈసారి రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యే అవకాశం నెలకొన్నది. దీంతో మండలాలు గ్రామాల్లో ఫ్లెక్సీల ప్రచారంతో జనాలకు పరిచయమైన ద్వితీయ శ్రేణి నాయకులు సింగిల్ విండో ఎన్నికలు తమకు చుక్కానిలా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ అమలుపై డ్రాల అనంతరం కనీసం 58 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అంచనాలకు భిన్నంగా రిజర్వేషన్లు వచ్చాయని పరిశీలకులు చెప్పడం కొసమెరుపు.
పెండ్యాల కొండల్