మన తెలంగాణ/సిటీ బ్యూరో: సినిమాలను పైరసీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చే శారు. ఐసిసిసిలో సోమవారం ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వివరాలు వెల్లడించారు. బీహార్‌లోని గుల్జార్‌బాగ్, సంపత్‌చక్‌కు చెందిన అశ్వని కుమార్(21), తమిళనాడులోని కరూర్‌జిల్లా, కరూర్‌జిల్లా, వెలుస్వామిపురానికి చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్, ఎపిలోని తూర్పుగోదావరి, అమలాపురం మండలానికి చెందిన జాన కిరణ్ కుమార్ నగరంలోని వనస్థలిపురంలో ఉంటూ ఎసి టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం, ఈరోడ్ జిల్లా, సత్యమంగళం, కోర్టురోడ్, విఐపి నగర్‌కు చెందిన సుధాకరన్, బీహార్ రాష్ట్రం, జెహనాబాద్, ఫిదా హుస్సేన్ రోడ్‌కు చెందిన అర్సలాన్ అహ్మద్ కలిసి సినిమాలను పైరసీ చేస్తున్నారు. సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృథా అవుతోందని పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
నాలుగు నెలలు కష్టపడి దర్యాప్తు చేశామని తెలిపారు. దేశంలో మొదటి సారి పైరసీ చేస్తున్న ముఠాను పట్టుకున్నామని, 2023లో దేశంలోని చిత్ర పరిశ్రమ రూ. 22,400 కోట్లు పైరసీతో నష్టపోయిందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన జానా కిరణ్ కుమార్ అత్తాపూర్‌లోని మంత్ర మాల్ థియేటర్‌లో సినిమాలు రికార్డు చేశాడు. చాలా సినిమాలని అత్తాపూర్‌లోని మంత్ర థియేటర్‌లో మొబైల్‌తో రికార్డ్ చేసి సిరిల్‌కు పంపిస్తున్నాడని తెలిపారు. ఇలా కిరణ్ 40 సినిమాలను థియేటర్‌లో రికార్డు చేశాడు. ప్రతి సినిమాకు 300 నుంచి 400 డాలర్లను బిట్ కాయిన్స్ రూపంలో కిరణ్ కుమార్ తీసుకుంటున్నాడని తెలిపారు. వాటిని క్రిఫ్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంని ఉపయోగించి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నాడని చెప్పారు. సినిమా పైరసీ చేయడానికి అనువైన సీటు చూసుకుని, టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్‌తో రికార్డ్ చేస్తున్నాడని తెలిపారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నాడని తెలిపారు. అలాగే, బీహార్‌కు చెందిన అర్సలన్ అహ్మద్ కూడా హిందీ భోజ్‌పురి సినిమాలు రికార్డ్ చేసి సిరిల్‌కు పంపుతున్నాడని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పేర్కొన్నారు. ఇన్స్‌స్పెక్టర్లు ఎస్. నరేష్, సతీష్ రెడ్డి, దిలీప్ కుమార్, మధుసూదన్ రావు, ఎస్సైలు సురేష్, మహిపాల్ దర్యాప్తు చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ…
2024లో పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ రూ. 3,700 కోట్లు నష్టపోయిందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని సమగ్ర దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. పైరసీ మూవీస్ వల్ల ఆన్‌లైన్ బెట్టింగ్ కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారని తెలిపారు. వెబ్‌సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారని తెలిపారు. సర్వర్స్ హ్యాకింగ్‌తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారని తెలిపారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
బెట్టింగ్ నిర్వాహకుల ప్రచారం..
బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా వారి యాప్‌లను ప్రచారం చేసుకుంటున్నారని సిపి సివి ఆనంద్ తెలిపారు. తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్‌సైట్ లలో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు.
పైరసీలో సిరిల్…
సినిమాల పైరసీలో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిరిల్ నాలుగు వెబ్‌సైట్లను 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసిన సిరిల్ ఈజీ మనీకి అలవాటు పడి పైరసీ చేయడం ప్రారంభించాడు, ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు. నెదర్లాండ్ ఐపీ అడ్రస్ ద్వారా సినిమాలను వెబ్‌సైట్లల్లో అప్‌లోడ్ చేశాడు. ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ మరో రెండు సర్వర్‌లను కూడా వినియోగిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానని తనను పోలీసులు కనిపెట్టరని నిందితుడు భావించాడు. ఎవరూ తమ వరకు రారని అన్ని జాగ్రతలు తీసుకున్న కూడా హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటంతో సిరిల్ షాక్‌కు గురయ్యాడు. 1xబెట్ , 4రా బెట్, రాజ్‌బెట్, పారిమ్యాచ్ బెట్టింగ్ యాప్‌లు నెలకు సిరిల్ రూ. 9 లక్షలు జీతం ఇస్తున్నాయి. సిరిల్ నెలకు సుమారు 15 సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నాడు. తమిళ్ బ్లాస్టర్స్ అనే ఒక వెబ్‌సైట్‌లోనే 500 మూవీలు అప్‌లోడ్ చేశాడు. ఇటీవల విడుదలైన కుబేర కూడా సిరిల్ వద్ద లభించింది. సిరిల్10 క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు, మూడు బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నాడు. క్రిప్టో కరెన్సీనీ యూఎస్ డాలర్‌లోకి ట్రేడింగ్ చేసే అశ్విని కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అశ్విని కుమార్(22) అనే వ్యక్తి డిజిటల్ మీడియా సర్వర్‌లను హ్యాక్ చేసి సినిమాను కాపీ చేస్తాడని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.
సర్వర్ హ్యాక్ పైరసీ…
బీహార్ రాష్ట్రానికి చెందిన అశ్విన్ కుమార్(22) డిజిటల్ మీడియా సర్వర్‌లను హ్యాక్ చేసి సినిమాలను కాపీ చేస్తున్నాడు. తన ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నడు. పోలీసులు రావడం చూసి మొబైల్ డేటా డిలీట్ చేశాడు, హార్డ్ డిస్క్‌లో డేటా మాత్రం డిలీట్ చేయలేక పోయాడు. హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, 10, 20 సినిమాలను డైరెక్ట్‌గా సర్వర్‌లను హ్యాక్ చేసి సినిమాలు అప్‌లోడ్ చేశాడు. 200 ఎంబీ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్‌ను అశ్విన్ కుమార్ వినియోగిస్తున్నాడు. సినిమాలు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్ల సర్వర్‌లను కూడా హ్యాక్ చేశాడు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశాడు. హిట్-3 సినిమాతో పాటు ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు అశ్విన్ కుమార్ హార్డ్ డిస్క్‌లో దొరికాయి.