న్యూఢిల్లీ : భారత్-భూటాన్ మధ్య కొత్తగా రెండు సరిహద్దు రైళ్ల మార్గాల ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. భూటాన్ నగరాలైన సామిత్సే, గెలేపు నగరాలతో రూ. 4000 కోట్లతో సరిహద్దు మార్గాలు ఏర్పాటవుతాయని వివరించింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ , విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా ప్రతినిధులకు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని బ్యానర్‌హాట్‌తో భూటాన్ లోని సామిత్సేతో ఒక మార్గం, అస్సాంలోని కోక్‌రాయిర్ నుంచి భూటాన్ లోని గెలేపునకు మరో మార్గం ఏర్పాటుకు ఉభయ దేశాల ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని మిస్రీ చెప్పారు.
ఈరైలు మార్గాల ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది ప్రధాని మోడీ భూటాన్ పర్యటనలో ఒప్పందంపై సంతకాలు జరిగాయన్నారు. భారత రైల్వేలు చేపట్టనున్న ఈ నెట్‌వర్క్ ప్రాజెక్టుకు రూ. 4033 కోట్లు ఖర్చవుతాయని, వీటివల్ల 89 కిమీ రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటవుతుందని వైష్ణవ్ వివరించారు.