దసరా పండుగ సందర్భంగా వచ్చే నెల మూడున అలయ్-బలయ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె ’దత్తన్న అలయ్-బలయ్’ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి నాంపల్లి, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వారు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అలయ్-బలయ్ వేదికపై సన్మానం చేయనున్నట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, తెలంగాణ ప్రాంత వంటల రుచులు అతిథులు ఆస్వాదించేలా తయారు చేయిస్తున్నామని ఆమె చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని, తెలంగాణ, హర్యానా అసెంబ్లీ స్పీకర్లను, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగర్ రావు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలనూ ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావునూ ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌నూ ఆహ్వానించినట్లు చెప్పారు. సుమారు ఇరవై వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఇరవై ఏళ్ళ క్రితం దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ఆయన కుమార్తెగా తాను గత ఐదేళ్ళుగా కొనసాగిస్తున్నానని ఆమె వివరించారు.