హైఫా: ఇజ్రాయెల్ హైఫా నగర మేయర్ సోమవారం అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించారు. ఒట్టోమన్ పాలన నుండి తమ నగరాన్ని విముక్తి చేసింది బ్రిటిష్ వారు కాదని, భారతీయ దళాలే అని తెలిపారు. దీనికి సంబంధించి చరిత్ర పుస్తకాలలో మార్పులు చేస్తున్నామన్నారు. ‘నేను ఈ నగరం నుంచే పట్టభద్రుడిని అయ్యాను. ఈ నగరాన్ని విముక్తి చేసింది బ్రిటిష్ వారని పదేపదే నూరిపోశారు. కానీ మా పరిశోధనలో తేలింది అది వారు కాదని, భారతీయ సైనికులని’ అని హైఫా నగర మేయర్ యోనా యహవ్ తెలిపారు. శ్మశాన వాటిక వద్ద భారత సైనికుల ధైర్యసాహసాలకు ఆయన నివాళులు అర్పించి ప్రసంగించినప్పుడు ఈ వివరాలు వెల్లడించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ అశ్వదళం ఈటెలు, కత్తులతో హైఫా నగరాన్ని విముక్తి చేసినట్లు ఆయన తెలిపారు. మౌంట్ కార్మెల్ కింద ఉన్న నగరాన్ని విముక్తి చేసినట్లు ఆయన వివరించారు. 1918లో 15వ ఇంపీరియల్ సర్వీస్ కావల్రీ బ్రిగేడ్ చేసిన అశ్వికదళ చర్య తర్వాత హైఫా నగరం విముక్తమయింది. దీనికి భారతీయ అశ్వికదళ రెజిమెంట్లయినమైసూర్, హైదరాబాద్, జోధ్‌పూర్ లాన్సర్స్ ధైర్య సాహసాలే కారణం. వారి గౌరవార్ధం భారత సైన్యం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ని ఫైఫా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇజ్రాయెల్‌లోని హైఫా, జెరూసలేం, రాంలేలలో భారత సైనికుల స్మారక చిహ్నాలు నేటికి ఉన్నాయి. వారిలో యూదు సంతతికి చెందిన కొంత మంది భారతీయ సైనికులు కూడా ఉన్నారు.