రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు పోటీ అనర్హులు అన్న నిబంధనలు ఉంది. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. 1995 తర్వాత అమలులోకి వచ్చిన ఈ నిబంధనను తొలగిస్తామని గతంలో ప్రచారం జరిగింది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల విడుదల చేసినప్పటికీ, పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు పోటీకి అనర్హులు అనే నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదు. దాంతోపాత నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన గత ప్రభుత్వం ఈ నిబంధనలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత పద్ధతినే అమలు చేసింది. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. గతేడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు.
అధికారవర్గాలు కూడా ఇటీవల ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు అనర్హులు అని తేల్చింది. ఇటీవలి కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని, ఈ క్రమంలో ఎంపీ, ఎంఎల్‌ఎ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలను కనాలని ఆదేశించారు. ఈ మేరకు ఎపిలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. దీంతో తెలంగాణలో సవరిస్తారని చర్చ జరిగింది. ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సెక్షన్ 21(3)ని మాత్రం సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగా ఉండనుంది. ఈ క్రమంలో పాత నిబంధనల ప్రకారమే సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.