లండన్: క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్ ఆల్‌రౌంటర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల క్రిస్ వోక్స్ ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 217 మ్యాచులు ఆడాడు. బౌలింగ్‌లో 396 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3,705 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్, 2022 టిం ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆఖరి టెస్ట్‌లో తీవ్రంగా గాయపడినప్పటికీ.. క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఫీల్డింగ్ చేస్తుండగా.. భుజం ఫ్రాక్చర్ కావడంతో క్రిస్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్‌కి వచ్చాడు. దీంతో అందరూ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ గాయమై క్రిస్ రిటైర్‌మెంట్ ప్రకటించేందుకు కారణంగా అనిపిస్తోంది. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది. అందుకే రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నాను. ఇంగ్లండ్ తరఫున ఆడాలన్నది నా చిన్ననాటి కల. అది నిజమైనందుకు నేను అదృష్టవంతుడిని. ఇంగ్లండ్ తరఫున ఆడటం.. మూడు సింహాలు ముద్రించి ఉన్న జెర్సీని ధరించడం.. గత 15 ఏల్లుగా సహచరులతో మైదానంలో గడపటం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి. సహచర ఆటగాళ్లు చాలామంది నా జీవితకాల మిత్రులుగా మారిపోయారు. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంటూ క్రిస్ వోక్స్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కౌంటీ క్రికెట్ కొనసాగిస్తానని.. ఫ్రాంజైజీ క్రికెట్‌లో అవకాశాలను అన్వేషిస్తానని అతడు తెలిపాడు.