ఈ తాపఉదయిస్తున్న సూర్యుడు,
వెలుగులనే కాదు, పూల బుట్టల్ని
కూడా మోసుకొచ్చాడు
పూల తోటలు అడవులను వదిలి
మా ఊరి వాడలోకి వచ్చాయి
మేఘం సింగిడితో జతకట్టి
మా ఇంటి ముందుకొచ్చింది
రంగురంగులుగా సింగారించుకున్న
బతుకమ్మను చూసి మా ఊరి
చెరువమ్మ అలిగింది
తేనెల ఊటల పాటలతో
మా ఊరి ఆడపడుచుల నోళ్ళు
ఎర్రగా పండాయి
బారులు తీరిన జనాన్ని చూసి
సూర్యుడు మేఘం చాటున దాక్కున్నాడు
బతుకమ్మ ఊరేగింపు
మా పచ్చని ఊరి పొలిమేరను
పలకరించి పరవశించింది
కోటితారల వెలుగుల్లో, సాటిరాని కాంతులతో
పుట్టింటిని వదిలిన ఆడబిడ్డ కన్నీరు లెక్కన
మా బతుకమ్మ చెరువును ముద్దాడింది
బతుకమ్మ అంటేనే తెలంగాణ ఆడబిడ్డ
-కె.రమ్య