న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా
అక్కడ ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా
ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదు
నా కోసం కాదు…భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ
సింగరేణికి పదెకరాల భూమి ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తాం
రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొత్త యుగానికి బాటలు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని, ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని, అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. తనకు పదేళ్లు అవకాశం ఇస్తే న్యూయార్క్, దుబాయ్‌తో పోటీ పడేలా చేస్తానని న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానని, మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదని ప్రశ్నించారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్‌పేటలో పునాది రాయి వేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్- 1 నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని, ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని, అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ తన కోసం కాదని, భవిష్యత్తు తరాల కోసమే అని స్పష్టం చేశారు.
చంద్రబాబు, వైఎస్‌ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారని, అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్ వచ్చాయని అన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని, చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు సూచన చేస్తున్నానన్నారు. 2026 డిసెంబర్‌లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని చెప్పారు. ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్‌సీడీఏ నుంచే చేపడతామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు నెలకు నాలుగు రోజులు ఇక్కడే ఉండాలని సూచించారు. సింగరేణికి పదెకరాల భూమి ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తామని, ఏడాది తిరిగే లోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్టూన్ కంపెనీలే ఉన్నాయని, రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే తమ లక్ష్యం అన్నారు. మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించారని, ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారన్నారు.
నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారని, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగిందని వివరించారు. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని,మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయని అన్నారు . దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్ ఫీల్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని, ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని కోరారు.
కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు
ఫ్యూచర్ సిటీపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇక్కడ భూములు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందుతరాల కోసం చంద్రబాబు, వైఎస్సార్ ఆలోచించారని చెప్పారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓటర్ రింగ్ రోడ్డు వచ్చాయని గుర్తుచేశారు. గతం నుంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓ మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని, రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నానని, అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం అన్నారు.
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక క్రమంలో భూములు కోల్పోతున్న కొంతమందికి నష్టం, కష్టం వచ్చి ఉండవచ్చని, ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తగిన పరిహారం ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్ సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తాను ఎవరికీ అన్యాయం చేయనని, న్యాయంగా పరిష్కరించుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పామని, ఇందిరమ్మ ఇండ్లు, ఏటీసీ, ఆసుపత్రి ఇవ్వాలని ఇప్పటికే సూచించానని, ప్రభుత్వం వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది: భట్టి విక్రమార్క
ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోందని, భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీ చుట్టే తిరగబోతుందేమో అన్న భావన తనకు కలిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు దేశంలోని ఏ నగరానికి ఈ వ్యవస్థ లేదు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్డు వేయడం, ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్ రోడ్డు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి మంజూరు చేయించుకుని వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే ఆ పనులకు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే చాలా సంతోషం వేసిందన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు రోడ్డు ఈ పనులన్నీ చూస్తుంటే ఇది ఒక మహా అద్భుతంగా మారే నగరంగా రూపు దిద్దుకోబోతుందన్నారు.
హైదరాబాద్ ఓల్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి తెల్లవారుజామునే భవిష్యత్తు నగరానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. 436 ఏళ్ల కిందట కులీ కుతుబ్ షా ల పాలనా కాలంలో ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాటి రాజ్యం అవసరాలకు దక్షిణ మూసి అనువైన ప్రాంతంగా గుర్తించి 436 సంవత్సరాల క్రితం సుసంపన్నమైన, ప్రపంచ పటంలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుందన్నారు. ఈ నగర నిర్మాణ సమయంలో కులీకుతుబ్‌షా దేవుని ప్రార్థిస్తూ దేవా నదులన్నిటినీ చేపలతో నింపినట్టు నా నగరాన్ని జనాభాతో నింపండి అని ప్రార్థించాడు అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఎలా నిలబెట్టారో..ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేస్తూ పిలుపునిచ్చిందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో కూడిన అనేక కార్యక్రమాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ఆశీర్వదించమని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానంతో అంతా కదిలి వచ్చామన్నారు. వారి ఆహ్వానంతో కులీ కుతుబ్ షా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.
ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం కాబోతోందని, ఈ సిటీ ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప వైద్య, విద్యాసంస్థలు రాబోతున్నాయని చెప్పారు. పనుల కోసం దేశ, విదేశాల్లో తిరిగి మంచి శాంతి భద్రతలతో స్థిర నివాసం ఎక్కడ అంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉంవన్నారు. గొప్ప సంకల్ప బలంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యక్రమం త్వరితగతిన పూర్తి కావాలని ఆ దేవుని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సిటీ నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు.
(బాక్స్ ఐటమ్)
కొత్త యుగానికి బాటలు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్ గుర్తుకువస్తుందని, రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరం అంటే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గుర్తుకు వచ్చేలా ఈ సిటీ నిర్మించబోతున్నామన్నారు. ‘లివ్ – లెర్న్ – వర్క్ – ప్లే’ అనే కాన్సెప్ట్ తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ అన్ని ఒకే చోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. భావి తరాల కోసం, మన బిడ్డల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు మనందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని, ఇది కొత్త యుగానికి కొత్త బాటలు అని చెప్పారు. ఇది ‘నెట్ జీరో కార్బన్ సిటీ’ అని, ఇక్కడ పచ్చదనం ఉంటుందన్నారు. కాలుష్యం ఉండదని, పరిశ్రమలు వస్తాయని, కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెప్పారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో పాలు పంచుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. రేపటి తరాల కోసం..తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.