సమగ్రంగా దర్యాప్తు జరపాలి హైకోర్టులో టివికె పిటిషన్
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించిన పార్టీ అధినేత విజయ్
కరూర్ : తమిళనాడులోని కరూరులో శనివారం హీరో విజయ్ సభలో తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరుకుంది. 67 మంది వరకూ స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి ఒకరు ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య, చికిత్స ఇతర విషయాల గురించి తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు ప్రకటన వెలువరించారు. మరో వైపు విజయ్ సారధ్యపు తమిళగ వెట్రి కజగం (టివికె) ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. పార్టీకి చెందిన లీగల్ సెల్ ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి ఎం ధండపాణి నివాసానికి వెళ్లి పిటిషన్ గురించి ప్రస్తావించింది. ఈ విషయాన్ని పార్టీ తరఫు లాయర్ అరివజగన్ విలేకరులకు తెలిపారు. తొక్కిసలాట వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాల సంకేతాలు వెలువరించింది. ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు కోరుతూ తమ పార్టీ ఇప్పటికే తమిళనాడు హైకోర్టులో అప్పీలు చేసిందని ఉప ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ విలేకరులకు తెలిపారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించారని వివరించారు. ఘటనపై సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపించాలని, హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కూడా టివికె డిమాండ్ చేసింది.
ఇక తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రూ 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు చెన్నైలో చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను తాను తిరిగి ఇవ్వలేనని , ఇది పూడ్చలేని నష్టం అని , అయితే ఈ అత్యంత విషాదకర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తోడుగా ఉండటం తమ కర్తవ్యం అని స్పందించారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందన్నారు. దేవుడి దయ వల్ల ఈ విషాద ఘట్టం నుంచి తేరుకొంటుందని ఆశిస్తున్నానని, కుటుంబాలకు తలో 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధం అయినట్లు చెప్పారు. అంతకు ముందు చెన్నైలో ఆరోగ్య శాఖ కార్యదర్శి పి సెంథిల్ కుమార్ ఘటనపై విలేకరులతో మాట్లాడారు. మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. మృతులలో 17 మంది మహిళలు, 14 మంది పురుషులు , ఐదుగురు బాలికలు ఉన్నారని , పోస్టుమార్టం తరువాత కుటుంబాలకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికీ 67 మంది ఇన్‌పెషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిలో ఒకరిని అత్యుత్తమ చికిత్సకు మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వివరించారు. ఘటనలో మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి పరిధిలో అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులకు రూ 50 వేల చొప్పున మంజూరు చేస్తారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయం అని సామాజిక మాధ్యమంలో స్పందింంచారు.