తగ్గిన వరద ఉదృతి..
ఊపిరి పీల్చుకున్న జనం
పునరావాస కేంద్రాల్లోంచి తిరిగి ఇళ్లలోకి బాధితులు
ఎంజిబిఎస్ నుంచి బస్సుల రాకపోకలు పునరుద్ధరణ
వ్యర్థాలను తొలగిస్తున్న జిహెచ్‌ఎంసి సిబ్బంది
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మూసీనది శాంతించింది. గత రెండు రోజులు కంటిమీద కునుకులేకుండా చేసిన మూసీనది.. ఆదివారం సాయంత్రానికి వరద ఉదృతి తగ్గింది. తవ్ర వత్తిడికి గురిచేసిన, ఆందోళనకు కారణమైన మూసీనది వరదలు ఎట్టకేలకు సాదారణ స్థితికి చే రాయి. ఈ వరదలతో ఏలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికార యం త్రాంగం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఎంజీబిఎస్ నుండి బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జీకి మరమ్మతులు చేయాలని గ్రేట ర్ అధికారులు గుర్తించారు. వాహనాలకు అనుమతించలేదు.
బస్తీల్లోకి చేరిన బురద, వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థాలను, చెట్లను తొలగించడంపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. మూసీనది వరదల ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసి అధికారులు ఆదివారం పరిశీలించారు. చేపట్టాల్సిన చర్యలను మొదలుపెట్టారు. బ్రిడ్జీల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు, కొట్టుకొచ్చిన చెట్లు, ఇతర వస్తువులను తొలగించడం షురూ చేశారు.
ఎంజీబిఎస్ నుండి బస్సులు షురూ..
గ్రేటర్ నగర శివారులోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి ఔట్‌ఫ్లో తగ్గడంతో మూసీనదిలోని వరద తీవ్రత తగ్గింది. గత శనివారం సాయంత్రానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద చేరడం తగ్గింది. అప్పటి నుంచే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపల వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బురద, చెట్లను తొలగించే పనులు ఆదివారం తెల్లవారు జాము వరకు కొనసాగించారు. అంతా క్లియర్ కావడంతో ఆదివారం ఉదయం నుంచి ఎంజీబీఎస్ నుంచి ఎదావిధిగా బస్సులు నడవడం మొదలుపెట్టారు. ఇక చాదర్‌ఘాట్ పాత బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద అర్ధరాత్రి కూడా వరద ప్రవాహం ఉదృతి కొనసాగింది. ఉదయం నీటి ప్రవాహం తీవ్రత తగ్గినప్పటికీ బ్రిడ్జిలు కొంత దెబ్బతిన్నాయినే నిర్ణయానికి అధికారులు రావడంతో వాహనాలను అనుమతించలేదు. దీనికితోడు బ్రిడ్జిలపై చెత్త, చెట్లు పేరుకుపోవడంతో వాటిని క్లియర్ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి మూసీనదిలో వరద ఫ్లో తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లలోకి జనం చేరుకున్నారు. పరిసరాలు చెత్త, వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో తడిసిన వస్తువులను చూసి ప్రజలు కన్నీరు పెట్టారు. రోడ్లపై సైతం మోకాళ్ల లోతు బురద చేడంతో జేసీబీలు, జీహెచ్‌ఎంసీ యంత్రాలతో క్లీన్ చేయిస్తున్నారు. పూర్తిగా బస్తీల రోడ్లు, గుడిసెలు, ఇండ్లు క్లీన్ అయ్యేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. దోమలు తీవ్రంగా ఉండటంతో ఎంటమాలజీ విభాగం సిబ్బందితో ఫాగింగ్ తో పాటు యాంటీ లార్వా ఆపరేషన్లు చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో హెల్త్ క్యాంపులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అవరమైన వారికి మందులు అందిస్తున్నారు.
రెండ్రోజులు ఇండ్లకు దూరం..
రెండ్రోజులుగా మూసీ పరివాహక ప్రజలు పునరావాస కేంద్రాల్లో కొంత మంది తలదాచుకోగా, ఇంకొందరు వారివారి బంధువల ఇండ్ల వద్దకు వెళ్లారు. ఇలా దాదాపు 3 వేల మంది వరకు ఇండ్లను వదలి వెళ్ళినట్టు అధికార వర్గాల సమాచారం. వరద తగ్గిన కూడా బురద ఉండటంతో చాలా ఇండ్లకు ఇంకా కరెంట్ సరఫరా జరగలేదు. బురద పూర్తిగా ఇండ్లలో ఉండటంతో ఇంకా కొందరు ఇండ్లలోకి రాలేదు. ఈ ప్రాంతంలో అద్దెలకు ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. స్కూళ్లకు సెలవులు ఉండటంతో పాటు దసరా పండుగ ఉండటంతో ఇక్కడి వారు పండుగకు తమతమ ఊళ్ళకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు.
దెబ్బతిన్న వంతెనలు..
మూసారాం బాగ్, చాదర్‌ఘాట్‌బ్రిడ్జిలు ఇంకా మూతపడే ఉన్నాయి. భారీ వరదల వల్ల బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. రెంటింటిపై పూర్తిగా మట్టి పేరుకుపోవడంతో పాటు చెత్, చేదారం చేరింది. మూసారంబాగ్ బ్రిడ్జి కోతకు గురైంది. దీంతో రెండు బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు బంద్ చేశారు. ఓ పక్కన బ్రిడ్జిలపై క్లీనింగ్ కొనగిస్తున్నారు. అలాగే రెండు బ్రిడ్జిల పటిష్టను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చేపట్టిన తరువాతనే రీ ఓపెన్ చేయనున్నారు. మూసారంబాగ్ లో కొత్తగా కడుతున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరారు. రెండేళ్ల క్రితం పనులు మొదలుపెట్టిన ఆలస్యం అవుతుందని, పనులు పూర్తయితే స్థానికులకు ఇబ్బందులు తొలుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.