వివాదానికి తెరదించిన తెలంగాణ అర్చక సమాఖ్య
సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ
గిన్నిస్ వరల్ రికార్డ్ సాధించే దిశగా 10 వేల మందితో వేడుక
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం జరుపుకోనున్నారు. మరోవైపు దీనిని సోమవారంజరుపుకోవాలా? మంగళవారం జరుపుకోవాలా? అనే వివాదం తలెత్తగా తెలంగాణ అర్చక సమాఖ్య దీనిని సోమవారమే నిర్వహించుకోవాలని ప్రకటించింది. ఈ నెల 30 న మంగళవారం సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా తెలంగాణ అర్చక సమాఖ్య ప్రస్తావిస్తూ , బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదని, ఇది కేవలం ఆచారానికి సంబందించిన అంశమని స్పష్టం చేసింది. బతుకమ్మ పండుగ ప్రారంభం అయిన తర్వాత తొమ్మిదవ రోజు ననే ఆనాదిగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆచారమని గుర్తు చేసింది. ఈనెల 21వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, 22న అటుకుల బతుకమ్మ, 23న ముద్ద పప్పు బతుకమ్మ, 24న నానబియ్యం బతుకమ్మ, 25న అట్ల బతుకమ్మ, 26న అలిగిన బతుకమ్మ, 27న వేప కాయల బతుకమ్మ, 28న వెన్న ముద్దల బతుకమ్మ, చివరి రోజు 29న తొమ్మిదవ సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం ఆచారమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు నిర్వహించడం ఆనవాయితీ.. దీనికి ఎలాంటి తిధులు, ముహూర్తాలు బతుకమ్మ వర్తించవని పండితులు వివరించారు. వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట లోనూ సోమవారమే
రాష్ట్రంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునే వరంగల్ (హనుమకొండ) వేయి స్తంభాల గుడిలో సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం నిర్వహిస్తోన్నట్టు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ‘మన తెలంగాణ’ కు తెలిపారు. ‘బతుకమ్మ ప్రారంభమైన తొమ్మిదో రోజు అయిన సోమవారం తమ ఆలయ ఆవరణలో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నామని చెప్పారు. యాదగిరి గుట్ట పండితులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
29 న సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ
గిన్నిస్ వరల్ రికార్డ్ సాధించే దిశగా బతుకమ్మ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో పదివేల మందితో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్తమానికి మంత్రులు జూపల్లికృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, హాజరుకానున్నారు.