తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 48 మంది ఐసియులో ఉన్నారు. అయితే ఈ ఘటన తర్వాత విజయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకూ విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి.
సామాజిక కార్యకర్త సెంథిల్ కన్నన్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కన్నన్ తన పిటిషన్‌లో ‘‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది అంటే ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందుకే టివికె పార్టీ భవిష్యత్తులో నిర్వహించే ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’’ అని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉంది.