హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా గురించి ఏ వార్త వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా మెగా హీరో నటిస్తున్నారని టాక్.
అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ పాత్ర చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు షూటింగ్ కోసం ఆయన ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. సినిమాలో ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని సందీప్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇంతలో ఇలా స్పిరిట్‌లో చిరు భాగం అవుతున్నారని టాక్ రావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.