దుబాయ్: ఆసియాకప్-2025 తుది దశకు చేరుకుంది. ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే రెండుసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచుల్లో గెలుపు భారత్‌నే వరించింది. దీంతో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ జట్టు ఫైనల్స్‌లో అయినా మంచి ప్రదర్శన చేయాలని వాళ్లు భావిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌తో జరిగిన మ్యాచుల్లో తమ ఓటమికి కారణాలను సల్మాన్ వెల్లడించాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుందని.. తద్వారా ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ‘‘భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో మేం చాలా పొరపాట్లు చేశాం. అందుకే ఓడిపోయాం. తక్కువ తప్పులు చేసి జట్లే విజయం సాధిస్తాయి. తప్పకుండా ఫైనల్‌లో ఆ పొరపాట్లు చేయకుండా విజయ తీరాలకు చేరే ప్రయత్నం చేస్తాం’’ అని సల్మాన్ అన్నాడు.
ఇక భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం గురించి కూడా సల్మాన్ మాట్లాడాడు. అండర్-16 నుంచి తాను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నానని.. గత 20 ఏళ్లలో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ఉండటం చేయకుండా ఉండటం చూడలేదని అన్నాడు. భారత్, పాక్‌ల మధ్య ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితుల సమయంలోనూ ఇలా జరగలేదని పేర్కొన్నాడు. ఇలాంటివి జరగడం క్రికెట్‌కు మంచిది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.