తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యజించిన మహానీయుడని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప నాయకుడని, ఆయన తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేశారన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని మంత్రి పేర్కొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనసాగిస్తున్నారని, కొండా లక్ష్మణ్ గురించి భవిష్యత్తు తరాలకు తెలిసేలా హార్టికల్చర్ యూనివర్సిటీకి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని మంత్రి తుమ్మల తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా చేనేత కార్మికుల రుణమాఫీ చేశామని చేనేత రంగాన్ని ప్రోత్సహించటానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో బతుకమ్మ చీరల వర్క్ ఆర్డర్ తో చేనేత కార్మికులు నిలదొక్కుకునేలా ప్రజా ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.