హైదరాబాద్: మార్పు మార్పు అని ప్రజలని ఏమార్చడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంచారని, నేడు బాకీ కార్డులను తాము అదే ఇండ్లకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి, ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయారని ఎద్దేవా చేశారు. బాకీ కార్డులు విడుదల సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ కార్డు చూపించి ప్రజలు నిలదీయాలని సూచించారు.
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అయ్యారని హరీష్ రావు చురకలంటించారు. బిఆర్ఎస్ ప్రారంభించిన వాటికి సిఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ చేస్తున్నారని, అయితే రిబ్బన్ కటింగ్ లేదంటే సంక్షేమ పథకాలకు కటింగ్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ అక్రమ కేసులతో ప్రభుత్వాన్ని నడపలేవని రేవంత్ కు చురకలంటించారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డరని, రేవంత్ ప్రభుత్వానికి కాలం దగ్గర పడుతుందని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని, బాకీ కార్డుతో అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తామన్నారు. తాము ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని తెలిపారు.