తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాల విందుని హామీ ఇచ్చింది. బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో.. ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది.
టీజర్ లో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదాల వేడుకకు వేదికగా ఈ టీజర్ నిలిచింది. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచింది. కేవలం ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివితో రూపొందిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ పొలిశెట్టి రచయిత కావడం విశేషం. తన రచయితల బృందంతో కలిసి వినోదభరితమైన స్క్రిప్ట్ ని అందించారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ’అనగనగ ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.