భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలపై తిరగబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూల దండ వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాట పటిమకు నిదర్శనంః కెసిఆర్
పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయ స్థానాల్లో ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్పూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించారని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆయన ఆమె చిత్రపటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాటి రాచరిక పాలనలో భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ మీద ఐలమ్మ చేసిన పోరాటం, తెలంగాణ మహిళా చైతన్యానికి బహుజనవర్గాల ప్రజాస్వామిక, ఆత్మగౌరవ పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు. ఎక్కడా రాజీ పడకుండా ఎప్పుడూ సబ్బండ వర్గాల అభ్యున్నతి సంక్షేమమే ప్రధానంగా గత పది సంవత్సరాలుగా తమ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను, పథకాలను కొనసాగించడం ద్వారా మాత్రమే చాకలి ఐలమ్మకు మనం అందించే ఘన నివాళి అని కెసిఆర్ అన్నారు.
బందూక్ పట్టించిన వీర నారి: మంత్రి వాకిటి
బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అన్న ప్రజలతో బందూక్ పట్టించిన వీర నారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర మత్స, యువజన, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. గాంధీ భవన్‌లో శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇలా ఉండడానికి స్పూర్తి ఐలమ్మ అని తెలిపారు. ఐలమ్మ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాదని, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారని అన్నారు.
మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది: బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్
వీర నారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దారుణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని బిజెపి ఒబిసి మోర్చా జాతీయ చైర్మన్, ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. చాకలి ఐలమ్మ వారి పోరాటం వల్ల బడుగు, బలహీనవర్గాలు, మహిళలలో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. వారు నిజాం బానిస శృంఖలాలను తొలగించేందుకు గొప్ప స్థైర్యాన్ని ప్రదర్శించారని చెప్పారు. చాకలి ఐలమ్మ గొప్ప పోరాట చరిత్రను గత పాలకులు బాధ్యతలేని విధంగా దాచి పెట్డడానికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు.