మన తెలంగాణ/హైదరాబాద్:బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (సిడబ్లుసి) అ నుమతి లేదని బిజెపి శాసనసభాపక్షం నాయకు డు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు చూపించే డాక్యుమెంట్లు, చెప్పేవి అన్నీ అబద్దాలేనని ఏలేటి బుధవారం తన నివాసంలో మీడి యా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాలపై చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు బనకచర్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. అసలు బనకచర్లకు సిడబ్లుసి అనుమతే లేదన్నారు. కృష్ణా నదీ జలాల పంపకాల్లో 299 టిఎంసిలకు సంతకం చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆ యన దుయ్యబట్టారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్‌లో నీటి వాటాల పెంపు అం శం లేదన్నారు. నీటి వాటాలో కాంగ్రెస్ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ అంతే చేసిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో రెండు పార్టీల ములాఖత్ అసెంబ్లీ సమావేశంలో స్పష్టమైందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట తొండలు జొర్ర గొడతా అని అసెంబ్లీలో మాత్రం వంగి దండాలు పెడతారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, బనకచర్ల డైవర్ట్ పాలిటిక్స్ చేసి సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వీరికి సమయం లేదు కానీ సభకు రాని నాయకుడు చెప్పిన అంశం (కృష్ణా జలాల)పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సమయం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
మూడో శక్తి ఎదగకుండా..
మూడో శక్తి ఎదగకుండా ఇరు పార్టీలు కుమ్మక్కై ఐదేళ్ళు మీరు, ఐదేళ్ళు మేము అని ఉంటామని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు స్పష్టమవుతున్నదని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కెసిఆర్ ఎన్నో తప్పులు చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏలేటి విమర్శించారు.