మన తెలంగాణ/హైదరాబాద్ : గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబ రాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లు నూతన సంవత్సర వేడుకలలో మునిగి తేలాయి. కొత్త సంవత్సర ఆరంభం కాగానే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆట పాటలతో సందడి చేశారు. కేక్‌లు కట్ చేసి నూతన సంవత్సరానికి శుభారంభం పలికారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశారు. హైదరా బాద్ నగరంలోని ఫ్లైఓవర్లను రాత్రి 11 గంటలకు క్లోజ్ చేశారు. అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించారు. మరోవైపు మెట్రో రైలు సర్వీసులు రాత్రి 1 గంట వరకు పొడిగించారు. నగరంలో పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షించి కింది స్థాయి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు.
ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్ పిల్లలకు ప్రశంసా పత్రాలు అందజేసిన డిజిపి
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి జలవిహార్ లో జరిగిన కార్యక్రమంలో డిజిపి బి.శివధర్ రెడ్డి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను జర్నలిస్టుల పిల్లలకు అందజేసి అభినందించారు. ప్రతిభను చాటిన వారికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహించడం పట్ల ప్రెస్‌క్లబ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పలతో పాటు ప్రెస్‌క్లబ్ బాధ్యులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.