న్యూఢిల్లీ : ఒడిశా తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఒకే లాంచర్ నుంచి రెండు క్షిపణులను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థాన్ని విజయవంతంగా పరిశీలించారు. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది.
రెండు క్షిపణులు నిర్దేశిత మార్గంలో ప్రయాణించి లక్షాలను కచ్చితత్వంతో ఛేదించాయని అధికారులు తెలిపారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి వివిధ రకాల వార్‌హెడ్‌లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకు పడగలదు.