పాట్నా : ఇటీవల బీహార్‌లో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ వైద్యురాలి హిజాబ్‌ను తొలగించడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సంఘటనతో ఇబ్బందిపడిన వైద్యురాలు నుస్రత్ పర్వీన్ ఇంకా విధుల్లో చేరలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. నియామక పత్రాలు అందుకున్న వైద్యులు పోస్టింగ్‌లో చేరడానికి ఇచ్చిన డెడ్‌లైన్ నేటితో ముగస్తుందని , సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సిన ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. ఈరోజు రిపోర్టు చేయకపోతే ఆమె అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయాల్సి ఉంటుందన్నారు.
కాగా హిజాబ్ వివాదం తర్వాత పర్వీన్ కుటుంబం పాట్నా నుంచి కోల్‌కతాకు మారినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో నుస్రత్ పర్వీన్ అనే వైద్యురాలికి నితీశ్ ఆయుష్ సర్టిఫికెట్‌ను అందజేశారు. సర్టిఫికెట్‌ను చేతికిచ్చిన ఆయన , డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను కొంతమేర తొలగించారు. సీఎం చర్యకు మహిళ స్పందించనప్పటికీ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు నితీశ్ చర్యను తీవ్రంగా ఖండించారు.