న్యూఢిల్లీ : ఓ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇడి) దేశ రాజధాని ఢిల్లీలో భారీ సోదాలకు దిగింది. స్థానిక సౌత్ ఢిల్లీలోని సర్వప్రియ విహార్ నివాసిత ప్రాంతంలో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ రూ 5 కోట్ల నగదు, రూ 8.80 కోట్ల విలువైన బంగారం , వజ్రాలు ఉన్న ఓ సూట్‌కేసును స్వాధీనపర్చుకున్నారు. ఇక ఏకంగా రూ 35 కోట్ల ఆస్తుల పత్రాలు కూడా కనుగొన్నారు. యుఎఇ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న హర్యానాకు చెందిన నేరస్తులు ఇందర్‌జిత్ సింగ్ యాదవ్ నివాసంలో ఇడి వర్గాలు మంగళవారం చేపట్టిన సోదాలు బుధవారం కూడా సాగాయి.
తప్పించుకు తిరుగుతున్న యాదవ్‌కు అనుచరుడు అమన్ కుమార్ పేరిట ఇక్కడి ఇల్లు ఉంది. బ్యాంకు అధికారులు భారీ స్థాయిల్ కరెన్సీ లెక్కింపు యంత్రాలతో నివాసంలోకి వెళ్లారు, చాలా సేపటి వరకూ నగదు లెక్కింపు జరిగింది. అక్కడనే ఉన్న సూట్‌కేసు నిండా విలువైన నగలు బంగారం, వజ్రాలు ఉన్నాయి. తమపై వచ్చిన ఆరోపణలు ఈ సోదాలపై యాదవ్ కానీ, కుమార్ కానీ ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదు. హర్యానాకు చెందిన యాదవ్ బలవంతపు సెటిల్మెంట్లు, ప్రైవేటు కంపెనీలకు లావాదేవీలు సాఫీగా జరిగేలా చేయడం, అక్రమ కార్యకలాపాలతో కోట్లు గడించడం వంటి చర్యలకు దిగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇంత భారీ మొత్తం , పత్రాలు, విలువైన సూట్‌కేసు దొరకడంతో ఈ యాదవ్ గురించి ఆయన అనుచరుడి గురించి పెద్ద ఎత్తున గాలింపునకు రంగం సిద్ధం అయినట్లు వెల్లడైంది.