జర్మనీలో అతి భారీ స్థాయి బ్యాంక్ చోరీ జరిగింది. దొంగలు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ ఖజానా లోనికి చేరుకుని , సెలవు దినాలలో అక్కడ రెండు రోజులు గడిపారు. స్పార్‌కిసే సేవింగ్స్‌బ్యాంక్‌లోకి చొరబడ్డ దొంగలు ఖాతాదార్లకు చెందిన ఎఫ్‌డి , బంగారు ఆభవరణాలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఉడాయించారు. గెల్సెన్‌కిర్సెన్ నగరంలో జరిగిన ఈ ఘటనలో దుండగుల పాలిట మొత్తం 30 మిలియన్ యూరోల చోరీ జరిగింది. దీని విలువ దాదాపు రూ 400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. బ్యాంక్ పార్కింగ్ ప్రాంతం నుంచి లోపలికి డ్రిల్ చేసి పలువురు దుండగులు చేరుకుని ,
రోజుల తరబడి మొత్తం 3200 సేఫ్టీ డిపాజిట్ లాకర్లను పగుల గొట్టారు. బంగారు నగలు తీసుకుని ఉడాయించారు. 2500 మంది బ్యాంకు ఖాతాదార్ల సొమ్ము , బంగారం దొంగల పాలయింది. జర్మనీలోనే ఇది అతి భారీ చోరీ వ్యవహారంగా మారింది. ఖజానా ఉన్న గడి గోడకు పెద్ద రంధ్రం చేసి దుండగులు లోపలికి చేరారు. చోరీ విషయం ఆలస్యంగా ఖాతాదార్లకు తెలిసింది. దీనితో వారు క్రమేపీ బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ చోరీపై భారీ స్థాయిలో ఆరా తీస్తున్నామని డిటెక్టివ్ పోలీసు అదికారులు తెలిపారు. అయితే ఇది ఓ స్టంట్ యాక్షన్ హాలీవుడ్ సినిమాలో బ్యాంక్ చోరీ తరహాలో జోరుగా సాగిందని వ్యాఖ్యానించారు.