ఇతర దేశాల నుంచి స్టీలు దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు సేఫ్‌గార్డ్ డ్యూటీ (రక్షణ సుంకాల) గడువును ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను నియంత్రించి, దేశీయ సరఫరాను మెరుగుపర్చడమే లక్షంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత 2025 ఏప్రిల్‌లో 12 శాతం తాత్కాలిక సుంకంగా 200 రోజుల పాటు విధించారు. ఈ గడువును 2028 ఏప్రిల్ వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. మొదటి ఏడాది 12 శాతం, రెండో ఏడాది 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం డ్యూటీ వసూలు చేస్తారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ జిందాల్ మాట్లాడుతూ, దేశీయ స్టీల్ మార్కెట్‌లో స్థిరత్వం కోసం ఇది సమతుల్య నిర్ణయమని అన్నారు. చైనా, జపాన్, కొరియా, వియత్నాం నుంచి పెరిగిన దిగుమతులు దేశీయ ఉపాధి, పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. డిజిటిఆర్ దర్యాప్తులో దిగుమతులు భారీగా పెరిగినట్టు వెల్లడైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జెఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, టాటా స్టీల్ వంటి కంపెనీల షేర్లు లాభపడ్డాయి.