న్యూఢిల్లీ : ఆరోగ్యపరమైన పెను ముప్పు తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెయిన్ కిల్లర్ నిమెసులైడ్ అధిక మోతాదుపై నిషేధం విధించింది. అంతేకాకుండా నోటితో తీసుకునే ఈ ఔషధం తయారీ, పంపిణీపై అనేక రకాల ఆంక్షలను విధించారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి బుధవారం కీలక ఉత్వర్వులు వెలువడ్డాయి. ఇబ్బందికర అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నందున ఇకపై ఎక్కడ కూడా 100 ఎంజిలకు మించి ఈ పెయిన్‌కిల్లర్‌ను విక్రయించరాదు, పంపిణీకి దిగరాదు. ఎవరూ దీనిని వాడరాదని అధికారులు తెలిపారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సిఫార్పుల మేరకు ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెయిన్‌కిల్లర్ పై ఆంక్షలను, నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆరోగ్యపరమైన సమస్యలతో కొందరు ఈ పెయిన్‌కిల్లర్‌ను ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో కొందరికి కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక మోతాదును తక్షణ రీతిలో నిషేధిస్తారు. ఇక ఇప్పటికే మార్కెట్‌లో పంపిణీలో ఉన్న ఈ రకాన్ని వెనకకు తీసుకోవల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 పరిధిలో ఈ పెయిన్‌కిల్లర్ నిషేధం విధింపు, దీనిని అమలు చేయడం జరుగుతుంది. డ్రగ్స్ సంబంధిత సాంకేతిక సలహా మండలితో సంప్రదింపుల తరువాత నిషేధ నిర్ణయం తీసుకున్నారు. అయితే తక్కువ డోసు నిమెసులైడ్ ఓరల్ మందులు అందుబాటులో ఉంటాయి. వీటిపై నిషేధం ఉండదు. వీడిని వాడుకునేందుకు వీలు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.