కెసిఆర్ సంకల్పాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో వడ్లు నిల్వ చేసే గోదాములు అందుబాటులో ఉన్నా వర్కర్ టు ఓనర్ పథకం కింద రూ. 400 కోట్లతో నిర్మించిన 50 షెడ్లలో కొన్ని షెడ్లు వడ్లు నిల్వ చేసేందుకు వాడటం బాధాకరమని అన్నారు. వాటి నిర్వహణ సాఫ్ సఫాయి బాగా లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని బుధవారం సాయంత్రం సిరిసిల్లలోని అపెరల్ పార్క్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో కార్మికులు, ఆసాములు, యజమానులు అనే మూడంచెల వస్త్రోత్పత్తి వ్యవస్థ ఉండటంతో కార్మికులను ఆసాములుగా మార్చాలనే సత్సంకల్పంతో 200 ఎకరాల్లో అపెరల్ పార్క్ ఏర్పాటు చేసామన్నారు. ఇందులో రూ.400 కోట్లతో వర్కర్ టు ఓనర్ పథకం కింద 50షెడ్లు నిర్మించామన్నారు. వాటిలో సబ్సిడీపై పవర్‌లూమ్‌లు ఏర్పాటు చేసి వాటిని దాదాపు 1, 500 మంది కార్మికులకు అప్పగించి వారినే యజమానులు చేయాలనుకున్నామని అన్నారు. అయితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం పోయిందని, దాంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని నిర్లక్షం చేస్తోందని అన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం కోసం నిర్మించిన షెడ్లలో గడ్డి, పిచ్చిమొక్కలు మొలిచాయని అన్నారు.
వడ్లు నిల్వ చేయడానికి తగినన్ని గోదాములు ఉన్నా కొన్ని వర్కర్ టు ఓనర్ షెడ్లలో వడ్లు నిల్వ చేయడం ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు. సిరిసిల్లలో తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల వస్త్రోత్పత్తులు జరపాలనేది కెసిఆర్ సంకల్పమని, దానిని కాంగ్రెస్ నీరుకారుస్తోందని మండిపడ్డారు.- సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోకి బిఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన గ్రీన్ నిడిల్, టెక్స్‌పోర్ట్ సంస్థలు తప్ప కొత్త పరిశ్రమలను కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండేళ్లుగా తీసుకురాలేదన్నారు. ఇప్పటికే సిరిసిల్ల నేతన్నలు ఉపాధి కరువై, యజమానులు బిల్లులు రాక షోలాపూర్, బీమండికి వలసలు పోతున్నారని, దీనిపై శాసన సభలో చర్చిస్తానన్నారు. వృధాగా ఉంటున్న వర్కర్ టు ఓనర్ షెడ్లపై సంక్రాంతి పండుగ లోపుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో 10 వేల మంది కార్మికులతో ధర్నా చేపడతానని హెచ్చరించారు. సిరిసిల్లలోని నేతన్నల సంక్షేమం కోసం కెసిఆర్ గతంలో రూ.3,400 కోట్లు వ్యయం చేసి బతుకమ్మ చీరలు తయారు చేయించి ఏటా కోటి మంది మహిళలకు పంచారని, దీని వల్ల నేత కార్మికులు, వారి ఇండ్లల్లో బీడీలు చుట్టే వారి భార్యాపిల్లలు బాగుపడ్డారన్నారు. నాలుగున్నర లక్షల మంది మహిళా బీడీకార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నెలకు రూ.లు 2 వేలు పెన్షన్ అందించారని అన్నారు.