కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటి స్థలాల విషయంలో డిసెంబర్ 9లోగా నెరవేర్చకుంటే భూ పోరాటాలు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో భూపోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు. కమ్యూనిస్టుల తరహాలో భూపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే కవిత జాగృతి జనంబాట యాత్ర పేరుతో గ్రామాలలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.