హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలియజేశారు. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పైకి వాహనదారులకు ప్రవేశం లేదని చెప్పారు. బేగంపేట్, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని ప్రకటించారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పివి ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమతి ఉంటుందని, ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు ప్రవేశం లేదని వెల్లడించారు.
కొత్త సంవత్సరం వేడుకుల సందర్భంగా మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. మహానగరంలో 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.