హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దేశ వాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు. దీంతో టీమిండియా జట్టులోకి షమీని తీసుకోవాలని మాజీలు, క్రికెట్ పండితులు కోరుతున్నారు. చివరిసారిగా ఐసిపి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో షమీ ఆడారు. అప్పటి నుంచి జట్టులోకి తీసుకోలేదు. ఫిట్‌నెస్ సమస్యలతో గత కొంత కాలంగా ఇబ్బందిపడుతున్నాడు. దీంతో అతడు జట్టు దూరం కావాల్సి వచ్చింది. దేశ వాళీలో బౌలింగ్ విభాగం నుంచి మంచి ప్రదర్శన చేసిన తరువాత కూడా జట్టులోకి తీసుకోకపోవడంతో బిసిసిఐ సెలక్షన్ కమిటీపై విమర్శలు వస్తున్నాయి. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు షమీని ఎంపిక చేయాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు. బిసిసిఐ వర్గాలు మేరకు షమీపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అతడి పిట్‌నెస్‌పై అందోళన చెందుతున్నట్టు సమాచారం. కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్ట్ చేశారనుకో… 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలను కొట్టి పారేయలేమని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు షమీ తీసిన విషయం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా గాయం కావడంతో జట్టులో చేరి అద్భుతమైన ప్రదర్శన చేసి సెలక్టర్ల నోర్లు మూయించాడు. ఇప్పటికి అతడిని వన్డే జట్టులోకి తీసుకోకపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదని మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా విశ్రాంతి కల్పిస్తుండడంతో షమీని తీసుకునే అవకాశాలు పక్కగా ఉన్నట్టు సమాచారం.