ఒకవైపు రాజకీయ అనిశ్చితి, మరోవైపు దేశాన్ని అస్థిరపరిచేలా కొన్ని మాసాలుగా కొనసాగుతున్న అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌కు మరో పెను విఘాతం తగిలింది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చైర్‌పర్సన్, మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా కన్నుమూయడం పొరుగు దేశానికి తీరని లోటు. నాలుగున్నర దశాబ్దాలపాటు జాతి రాజకీయాలను శాసించిన చరిత్ర ఆమెది. బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రజల నాడిని పసిగట్టి రాజకీయాలు చేయడంలో దిట్ట. పదిహేనేళ్ల వయసులో అప్పటికే సైనికాధికారిగా పనిచేస్తున్న జియావుర్ రెహ్మాన్‌ను వివాహం చేసుకున్న ఖలీదా, దాదాపు రెండు దశాబ్దాలపాటు రాజకీయాలకు దూరంగా, గృహిణిగా ఇంటికే పరిమితమయ్యారు. తన భర్త 1981లో జరిగిన సైనిక తిరుగుబాటులో మరణించిన తర్వాత, అప్పటికే జియావుర్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకుని, తదనంతరం పార్టీకి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. నియంతగా, వందలాది సైనికులను ఊచకోత కోయించిన నేతగా పేరుపడిన భర్త అడుగుజాడలలో నడవకుండా, దేశంలోప్రజాస్వామ్యాన్ని పాదుగొలిపేందుకు చేసిన కృషి ఆమెను ప్రజలకు చేరువ చేసింది. సైనిక నియంత హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలనపై ఆమె అలుపెరగని పోరాటం సలిపారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఏడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సైనిక పాలనపై పోరాటాన్ని ముందుండి నడిపిన ఘనత ఆమెకే దక్కుతుంది.
ఎర్షాద్ నియంత పాలన అంతమై, 1987లో పార్లమెంటరీ ఎన్నికలకు మార్గం సుగమం కావడానికి ఒక విధంగా ఖలీదా సలిపిన పోరాటమే కారణమంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో పలుమార్లు జైలుపాలైనా ఆమె వెరవలేదు. చివరకు 1991లో బిఎన్‌పి ఘన విజయం సాధించడంతో, దేశ ప్రధానిగా ఖలీదా తొలిసారి పదవీబాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం ఆమెకు పెను సవాలుగా మారింది. ప్రపంచ దేశాల సహాయ సహకారాలతో ఆమె క్రమంగా దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు. రెండు దఫాలు ప్రధానిగా ఎన్నికై, పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన ఖలీదా.. కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థకు రూపకల్పన చేశారు. పార్లమెంటులో 45 ఎంపి సీట్లను మహిళలకు రిజర్వ్ చేసిన ఘనత కూడా ఆమెదే. దేశంలో 70% మంది బాలికలు, యువతులు చదువుకునేందుకు పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడం తప్పనిసరి చేశారు. అయితే ఖలీదా జియా హయాంలో అవినీతి పేట్రేగిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె స్వయంగా నెలకొల్పిన జియా ఆర్ఫనేజ్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగం కేసులో తన ఇద్దరు కుమారులతోపాటు ఆమె అరెస్టయ్యారు. ఈ కేసులో కోర్టు ఆమెకు పదిహేడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె కొట్టిపారేయడం వేరే విషయం. గత ఏడాది అప్పటి ప్రధాని షేక్ హసీనా భారత్‌కు పరారైన అనంతరం, బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆమెకు క్షమాభిక్ష పెడుతూ, జైలునుంచి విడుదల చేశారు.
నాలుగు దశాబ్దాలపాటు దేశరాజకీయాలను శాసించిన ఇద్దరు బేగమ్ లు.. ఖలీదా జియా- షేక్ హసీనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. భారత్ తో సత్సంబంధాలను కొనసాగించాలన్న హసీనా నిర్ణయాన్ని ఖలీదా తప్పుపట్టేవారు. భారత్ తో ఆమె నేరుగా విభేదించకపోయినా, చివరివరకూ అంటీముట్టని వైఖరినే అవలంబించారు. ఒక దశలో అధికారంలో ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని భారత్‌కు తాకట్టు పెడుతున్నారంటూ జియా మండిపడటం గమనార్హం. 1972 ఇండో బంగ్లా స్నేహపూర్వక ఒప్పందం పునరుద్ధరణను ఖలీదా తీవ్రంగా నిరసించారు. ఖలీదా బతికుండి ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో తన పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురాగలిగి ఉండేవారేమో. మరో ప్రధాన పార్టీ అయిన అవామీ లీగ్‌పై ఎన్నికల సంఘం ఇప్పటికే వేటు వేసిన నేపథ్యంలో, బహుశా విజయం ఆమెకు నల్లేరుపై నడక అయి ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతలను ఖలీదా కుమారుడు, పార్టీ యాక్టింగ్ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. పదిహేడేళ్ల అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పి, నాలుగు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చిన ఆయన, తల్లి అడుగుజాడల్లో నడుస్తూ అందలం ఎక్కుతారో లేదో చూడాల్సిందే.