బెంగళూరు : భారత దేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్‌జి హెలికాప్టర్‌ను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో మంగళవారం ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్ ) దీనిని అభివృద్ధి చేసింది. సివిల్ ఏవియేషన్ మార్కెట్‌ను లక్షంగా చేసుకుని రూపొందించిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ల కంటే మెరుగైన సామర్ధాలను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ను ప్రారంభించిన అనంతరం అధునాతన వ్యవస్థలు, సదుపాయాలను రామ్హోహన్ నాయుడు పరిశీలించారు.
అత్యంత ఆధునిక ఈ హెలికాప్టర్ 5.5 టన్నుల బరువు ఉంటుంది. తేలికపాటి రెండు ఇంజిన్లతో బహుముఖ పాత్ర వహించే ఈ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భారతీయ వైమానిక చరిత్రలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిల్చిపోతుందన్నారు. ఈ హెలికాప్టర్ కేవలం ఒక యంత్రం మాత్రమే కాదని, భారత సామర్థానికి , నమ్మకానికి, ఆత్మనిర్భర్ భారత్ లక్షం అంకిత భావానికి చిహ్నంగా పేర్కొన్నారు. హెచ్‌ఎఎల్ యంత్రాంగాన్ని అభినందించారు.