డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా బిఖియాసైన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయ లోకి దూసుకెళ్లింది. ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్మోరా జిల్లా ద్వారహత్ నుంచి నైనిటాల్ లోని రామ్‌నగర్‌కు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పించా వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 నుంచి 19 మంది ప్రయాణికులు ఉన్నారని తెలియజేశారు.
ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర వైపరీత్య స్పందన దళాలతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. ప్రమాద స్థలంలో అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడని తెలిపారు. మృతులు 12 మందిలో డ్రైవర్ కూడా ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు.