దుబాయ్: యెమెన్ రేవు పట్టణం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధాలతో ధ్వంసమవుతున్న ఈ దేశం లోని వేర్పాటు వర్గాలకు ఆయుధాలు అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఆయుధ నౌక ఈ రేవు పట్టణానికి రావడమే ప్రధాన కారణం. ఎమిరాటి చర్యలు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అత్యంత ప్రమాదకరమైనవిగా తాము గమనించామని సౌదీ అరేబియా హెచ్చరించింది.
ఎమిరేట్స్ మద్దతు గల సదరన్ ట్రాన్షిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటు శక్తులు ఏమాత్రం హెచ్చరికలు పట్టించుకోకుండా దాడులకు పాల్పడడమే ఈ పరిస్థితికి కారణమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తూర్పుతీరం లోని రేవు పట్టణం ఫుజైరా నుంచి ఈ నౌకలు ఆయుధాలతో వచ్చాయి. అయితే ఈ దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేస్తూ సదరన్ ట్రాన్షిషనల్ కౌన్సిల్‌తో నేరుగా ఎమిరాటి చర్యలు మొట్టమొదటిసారి అనుసంధానం కావడాన్ని ఆక్షేపించింది.