న్యూఢిల్లీ : దేశ మంతా కొత్త సంవత్సర వేడుకలకు సంసిద్దమవుతున్న తరుణంలో గిగ్‌వర్కర్లు డిసెంబర్ 31బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ముఖంగా రెస్టారెంట్లు కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్లు అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు చెందిన గిగ్‌వర్కర్లు 10 నిమిషాల డెలివరీ మోడల్ తమకు సురక్షితం కాదని, దాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలను కార్మిక చట్టాల పరిధి లోకి తీసుకు రావాలని, ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా నిషేధించాలని, మెరుగైన వేతనాలు , సామాజిక భద్రత, పారదర్శకమైన పెనాల్టీ వ్యవస్థ ఉండాలని వీరు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ట్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారం వర్కర్స్ యూనియన్, ఈ బంద్‌కు పిలుపు నిచ్చాయి.