కోల్‌కతా: ఎన్నికల ప్రయోజనం కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించక పోవడం వల్లనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం కంచెవేయలేక పోతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా కోల్‌కతాలో బీజేపీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన సమస్యని వ్యాఖ్యానించారు. దేశంలోకి చొరబాటుదారులను నిలువరించేందుకు నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజేపీనే అధికారం లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని, అక్రమ వలస దారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని అమిత్‌షా ఆరోపించారు. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని, ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. తాము అధికారం లోకి వస్తే బెంగాల్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని స్వామి వివేకానంద, బంకించంద్ర చటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్‌ను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారం లోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 శాతం ఓట్లు, రెండు సీట్లు సాధించగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం ఓట్లు, 3 అసెంబ్లీ సీట్లు గెలుచుకుందని, అదే 2016 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించిందని తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 21 శాతం ఓట్లు, 77 సీట్లు గెలుచుకుందని గుర్తు చేవారు. 2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఐదేళ్లలో 77 సీట్లు గెలుచుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకుందని, కమ్యూనిస్టు కూటమి ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 39 శాతం ఓట్లు, 12 సీట్లు గెలుచుకుందని, 2026 లో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు